
ఆయనో ప్రభుత్వ చిరుద్యోగి. తిరుమల కొండపై ప్రొటోకాల్ వీఆర్వో. నెలకు వేతనం రూ.57 వేలు. ఈ మొత్తం గోశాలకే కేటాయిస్తున్నారు. ఈయన భార్య నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టులో ప్రాసెస్ సర్వరు. ఈమె నెల జీతాన్ని కుటుంబ పోషణకు ఖర్చు చేస్తున్నారు. వీరి కుమార్తెలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ తృతీయ ఏడాది చదువుతున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరుకు చెందిన అల్లాడి శేషగిరి దంపతులు పదేళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉదయం, సాయంత్రం గోశాలలోని పనుల అనంతరం వారి పనుల్లో నిమగ్నమవుతారు. గోశాల్లోని లేగ దూడలకు దంపతుల కుమార్తెలు సాయి పావని, చంద్రికా మహారాణిలు నామకరణం చేస్తారు.
దూడలే పాలు తాగేలా..
దూడలకు ప్రత్యేక గదుల్లో పంకాలు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. ఆవుల పాలను దూడలే తాగేలా చూస్తారు. దాతల సాయంతో వసతులు కల్పిస్తున్నారు. కార్తిక మాసంలో వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.





