
పాకిస్థాన్ సైన్యంపై జై సింధ్ ముత్తహిదా మహాజ్ -JSMM చైర్మన్ షఫీ బుర్ఫాత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యం ఒక అవినీతి కిరాయి మాఫియా అని, డాలర్లు ఇతర ప్రయోజనాల కోసం ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దశాబ్దాలుగా అవకాశవాదాన్నే తన వ్యూహంగా మార్చుకుని ప్రపంచ దేశాలను వంచిస్తోందని విమర్శించారు.
షఫీ బుర్ఫాత్ మాట్లాడుతూ.. “పాక్ సైన్యం యూకే సహా ఇతర ప్రపంచ దేశాలను చాలా సులభంగా మోసం చేయగలదు. ప్రచ్ఛన్న యుద్ధం నుంచి ఉగ్రవాదంపై పోరాటం వరకు ఇదే తీరును ప్రదర్శించింది. ఆ దేశ సైన్యం ఎప్పుడూ న్యాయం, సిద్ధాంతం కోసం కాకుండా కేవలం లాభాల కోసమే పనిచేస్తుంది” అని దుయ్యబట్టారు. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో జిహాద్ రక్షకుడిగా ప్రచారం చేసుకొని పాశ్చాత్య దేశాల నుంచి సహాయం పొందిందని గుర్తుచేశారు.
అదేవిధంగా, 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో చేతులు కలిపినట్టు నటిస్తూనే, ఆ దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందని ఆరోపించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం ప్రపంచాన్ని దశాబ్దాలుగా వంచిస్తున్నాయని అన్నారు. “డబ్బు కోసం పాక్ సైన్యం ఎవరికైనా ద్రోహం చేస్తుంది. బీజింగ్ ఎక్కువ చెల్లిస్తే వాషింగ్టన్‌కు, అమెరికా ఎక్కువ చెల్లిస్తే చైనాకు ద్రోహం చేయడానికి ఏమాత్రం సంకోచించదు” అని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత పాక్ సైన్యాధిపతి అసీం మునీర్‌పైనా షఫీ బుర్ఫాత్ తీవ్ర విమర్శలు చేశారు. మునీర్‌ను ‘నకిలీ ఫీల్డ్ మార్షల్’ అని అభివర్ణిస్తూ, ఆయన కాలం చెల్లిన సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. మునీర్ నాయకత్వంలో పాక్ సైన్యం ప్రపంచ దేశాల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, డబ్బు కోసం తమ విశ్వాసాన్ని అమ్ముకునే వారిని ఏ దేశమూ నమ్మదని ఆయన స్పష్టం చేశారు.





