
ఒక ఇల్లు మనం కడితే… ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. మీరు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీ ఇంటి పురోహితుణ్ణి పిలిచి… ‘‘రోజూ మా పూజా మందిరంలో దీపం వెలిగించి, స్వామికి ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వెళ్ళండి’’ అని చెప్పాలని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన గృహం అని అర్థం. అలా మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని చోట్లా దీపాలు వెలుగుతూ ఉండాలి. మీరు ‘స్వగృహే’ అని ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పగలరో అలాంటి అన్ని చోట్లా 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు… ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే కార్తిక పౌర్ణమినాడు 365 వత్తులున్న గుత్తి దీపాన్ని ఆవు నేతిలో ముంచి వెలిగిస్తూ ఉంటారు. పదిరోజులో, పదిహేనురోజులో… ఇది తెలియకముందు తప్పు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో, ఆ రోజుల్లో దీపం పెట్టకపోతే తమకు ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని 365 వత్తులు వెలిగిస్తారు.
దీపం – ఆధ్యాత్మిక నిర్వచనం
దీపం పరమేశ్వర స్వరూపం. ఈశ్వరుడు కాంతి స్వరూపుడు. ఆయన ఎల్లప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంటాడు. వెనుక ఉండి ప్రకాశిస్తూ… మన శరీరం ఎంతకాలం నిలబడాలో అంతకాలం ఊపిరిని గుప్తంగా నిలబెట్టి, ఆ ఊపిరి అయిపోగానే బయటకు వెళ్ళి… శవంగా చేసి పడగొట్టగలిగిన పరమేశ్వర స్వరూపమే అక్కడ కూర్చొని ఉంటుంది. అది కాంతి. అందుకే పూజ అంతా అయిపోయిన తరువాత మంత్రపుష్పంలో చెబుతారు… ‘నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా’ అని… అణువంత రూపంతో ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలుస్తారు? ఏ పేరు పెట్టి పిలిచినా అది పలుకుతుంది. యదార్థానికి ఇది ఒక రూపం కాదు. ఒక కాంతి. అందుకే వెలుగుతోంది. ‘భాస్కర’ అని పేరు. ‘భా’ అంటే కాంతి. ఆ కాంతి ఏదో అదే పరమేశ్వరుడు. నిజానికి ఆయనకు ఒక ఆకారం ఎక్కడుంది? ‘ఆకారంచ నిర్గుణంచ, సాకారంచ గుణకరం తత్త్వం తత్త్వం’ అంటారు శంకరాచార్యులవారు. నిర్గుణం, సగుణం అని రెండు రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలన్నవాడు పరమ వైరాగ్యంలోకి వెళతాడు. సాధారణ ఉపాసన చేసేవాడు, బాహ్య ప్రయోజనం కావాలనుకొనేవాడు మనస్సును నిలబెట్టాలి. కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యదార్థానికిఅది ఒక కాంతి పుంజం. ఆ కాంతి పుంజమే దివ్వె. దీపం అంటే ప్రకాశం. ఆ దీపమే పరమేశ్వర స్వరూపం.
యజమానే వెలిగించాలి
ఇంటి యజమాని దీపం వెలిగించాలి. ‘మా ఆవిడ వెలిగిస్తుంది. నేను టీవీ చూస్తాను’ అనుకోకూడదు. యజమాని పంచె కట్టుకొని వెళ్ళి, దేవాలయంలో దీపం పెట్టాలి. ‘‘యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతాలకు ఉపకారం’’ అని చెప్పాలి. సంకల్పంలో ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది తప్ప, ఆవిడ వెలిగించి ‘ధర్మపతీ సమేతస్య’ అని చెప్పడం సంకల్పంలో లేదు. పురుషుడే ఇంటికి యజమాని కాబట్టి… ఈ రోజున ఆ పని చేయకపోతే… పరమేశ్వరుడు అతనికి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం.
సమస్త జీవుల ఉద్ధరణ కోసం
కార్తిక పౌర్ణమినాడు వెలిగించే దీపం కేవలం మనకోసమే కాకుండా… మనం చేసే దుష్కృతులను, మన పాపాలను, అంతర తిమిరాన్ని, బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులను ఉద్ధరించడానికి పెట్టే దీపం. కాబట్టి ఆశ్వయుజ మాసం చివరిలో వచ్చే దీపంతో మొదలుపెట్టి, కార్తిక పౌర్ణమి వరకూ వెలిగించే దీపాలకు అంత గొప్ప గౌరవం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. దీపాలు వెళ్ళిపోవడం అంటే ఏమిటి? దీపాలను నీటి దగ్గరకు తీసుకువెళ్ళి, అరటి దొప్పలలో పెట్టి విడిచిపెడతారు. నీటిని ఆధారం చేసుకొని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది. ‘‘దీపం విడిచిపెట్టానండీ’’ అంటారు. ఆ దీపం వెళ్ళి ఎక్కడో మరో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెళుతూ, వెళుతూ ఆ నీటిలోనే ఎక్కడో సమాప్తమైపోతుంది. గంగానది ఒడ్డున నిలబడి చూస్తూంటే… అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతూ ఉంటే చూడడానికి మహా ముచ్చటగా ఉంటుంది. గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకుపోయినట్టు ‘రామానామ సంతుష్టాయైు నమోనమః’ అని లలితాపరాభట్టారికా స్వరూపంలో మీ మనసు లయమై, ఆ. భగవంతుడి గురించే చింతన చేస్తే ఆ భగవంతుడే మిమ్మల్ని తనలోకి తీసుకుంటాడనే పారమార్థిక భావన మనం నదిలో దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ ఉండడం వెనుక ఉంది.
నీటి రూపంలో పరమశివుడు
ఈశ్వరుడికి ‘తజ్ఝలా’ అని పేరు. నీటికి ఈశ్వరుడనే పేరు ఉంది. లింగ పురాణంలో ‘సజీవనం సమస్త నిగత సలిలభవాయుక్తి యుచ్యతే మూర్తి భవశ్య పరమార్థః’ అంటారు. ‘‘నీరుగా పరమశివుడు ఉన్నాడు’’ అని అర్థం. నీటిని ఆశ్రయించి దీపం వెళుతోంది. భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెళుతున్నాయి. సంకల్పాలు ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీసి, విడిచిపెడుతూ ఉంటే సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. మనస్సు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకొని మనసు, ఊపిరి వెళుతున్నాయి. దీపం రెపరెపలాడుతూ… ఎక్కడో ఈ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన ఆఖరి సంకల్పం కూడా ఆయన నుంచే వచ్చింది, ఆయనలోనే లీనమవుతుంది. అరటి దొప్ప మీద దీపం అలా అలా ప్రయాణం చేస్తూ ఉంటే, దానిలో ఉన్న ఆవు నెయ్యి ఆవిరైపోతుంది. అరటి దొప్పమీదే సమాప్తం అయిపోతుంది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చేప దాన్ని మింగేసింది. ‘గంగను ఆధారం చేసుకొని బయలుదేరి, గంగలోనే కలసిపోయిన దీపంలా… నిన్ను ఆధారంగా చేసుకొని, నీ గురించి చేసిన ఉపాసన వల్ల నా చైతన్యం నీలో ఐక్యమగునుగాక! పునరావృత్తిరహిత శివ శాశ్వత అంత్యస్థితిని పొందునుగాక!’ అనే పూనికను పెంచుకోవడమే దీపాన్ని విడిచిపెట్టడం. దాన్ని అరటి దొప్ప మీద ఉంచి విడిచిపెడతారు. ఎందుకని? ఆ జలభూతాలకు ఇబ్బంది కలుగకూడదు కాబట్టి. మనం చేసే పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటిదొప్పలాంటివి నీటిలో నానిపోయినా జలచరాలు తినగలుగుతాయి. అంతేకాని ‘నేను పెట్టిన దీపం నీటి మీద బాగా తేలాలి’ అనుకొని నీటిలో కరగని పదార్థాన్ని మీరు విడిచిపెట్టారనుకోండి. అది నీటిలో ఉండే వాటికి అపకారం చేసినట్టవుతుంది. అందుకనే ‘అరటి దొప్పలో దీపం విడిచిపెట్టండి’ అన్నారు పెద్దవాళ్ళు.
పరమేశ్వరుడిచ్చిన కానుక… జ్వాలాతోరణం
యమద్వార దర్శనం అంటే భీతి చెందిన ఋషులు దాని నుంచి రక్షించేది పరమశివుడు ఒక్కడే కాబట్టి ఆయనను మహా మృత్యుంజయ మంత్రాలతో ప్రార్థన చేశారు. వారికి ఆయన వరం ఇస్తూ కార్తిక పౌర్ణమినాడు జ్వాలా తోరణం ఏర్పాటు చేయమన్నాడు. ఆ ప్రకారం యమద్వారం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆలయాల ముందు జ్వాలాతోరణాన్ని నిర్మిస్తారు. రెండు కర్రలు పాతి, అడ్డంగా ఒక కర్ర కడతారు. కొత్త గడ్డి తీసుకువచ్చి దానికి చుడతారు. దాని మీద నెయ్యి పోస్తారు. ఇంధనం పోస్తారు. ‘ఆ యమ ద్వారాన్ని చూడవలసిన భయాన్ని మీకు పోగొట్టడానికి నేనున్నాను’ అంటూ ఆ స్వామి తనకు అవసరం లేకపోయినా… ఆ అగ్నితోరణం కిందకు పల్లకిలో మనతోపాటు వస్తాడు. కార్తిక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెళుతూ ఉంటే… వారితో కలిసి మూడు సార్లు ఆ తోరణం కింద అటూ ఇటూ ఎవరు వెళ్ళి వచ్చారో… వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడరు. అంటే శివ లోకాన్ని కానీ, విష్ణు లోకాన్ని కానీ పొందుతాడు. అది మహర్షులకు పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన కానుక. మహర్షుల కన్నా కూడా వారి ప్రార్థన మీద మానవాళికి ఇచ్చిన కానుక. కాబట్టి కార్తిక పౌర్ణమినాడు జ్వాలాతోరణం చెయ్యకుండా ఉండకూడదు. ఆ జ్వాలా తోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డి రక్ష పెడుతుందంటారు. అందుకే అగ్ని హోత్రం ఆరిపోయిన ఆ గడ్డిని ఇంటికి తెచ్చి చూరులోనో, గడ్డి వాములోనో పెడతారు. ఎప్పటికీ ధాన్యాగారాలు నిండుగా ఉండాలని కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. దాని కింద నుంచి శివుడు తిరిగాడు కాబట్టి… ఆ గడ్డి వల్ల భూత ప్రేతాదులు ఇంట్లోకి రావని వాటిని వీధి ద్వారం దగ్గర పెడతారు.
అనువైన చోటే దీపాలు వెలిగించాలి.
కార్తిక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మనకు పన్నెండు నెలలు ఉన్నప్పటికీ ఏ నెలలో పెట్టే దీపానికి ఆ నెల పేరు లేదు. ఒక్క కార్తిక మాసంలో వెలిగించే దీపానికి మాత్రమే ‘కార్తిక దీపం’ అని పేరు. కాబట్టి కార్తిక మాసంలో దీపం వెలిగిస్తే చాలన్నారు పెద్దలు. ‘వెలిగించాలి కదా’ అని కర్పూరపు బిళ్ళలు తీసుకువెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు. దీపం పెట్టడానికి ఎక్కడ అనువైన ప్రదేశమో… అక్కడే దీపాలు ఉంచాలి. కార్తికమాసంలో ఏ శివాలయానికైనా వెళ్ళి చూడండి… భక్తి ఎక్కువై, నందీశ్వరుడి వెనుక భాగంలో పెడతారు. ఇది పద్ధతేనా? ఇంకొకరు వచ్చి అక్కడ దర్శనం ఎలా చేసుకుంటారు? వారికి ఇబ్బంది కలుగుతుంది కదా? ఒక పని చేస్తున్నామంటే ఏదో చెయ్యడం కాదు. కొంచం మనసు పెట్టి విచారణ చేయాలి. మనిషిగా మనం ఎంత పరిజ్ఞానంతో, పరిపక్వతతో, పరిణతితో చేయవలసి ఉంటుందో… ఆ ప్రకారం ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప… సమస్త లోకానికి ఉపకారం జరగడం కోసం నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ఎవరికైనా అపకారం మాత్రం చేయకూడదు.





