ArticlesNews

పరమేశ్వరుడి అనుగ్రహం జ్వాలాతోరణం

47views

( నవంబరు 5 – జ్వాలాతోరణం )

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్‌
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్‌

కార్తికమాసానికి సమానమైన మాసం, సత్యయుగంతో సమానమైన యుగం, వేదాలతో సమానమైన శాస్త్రం, గంగానది వంటి మరో నది లేవు- అన్నది ఈ శ్లోకానికి అర్థం.

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తికమాసంలో ప్రతిరోజూ విశేషమైందే. అందునా కార్తిక పౌర్ణమి మరింత విశిష్టమైంది. పరమశివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన రోజిది. ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు దేవతలు స్వర్గమంతా దీపాలు వెలిగించారు. అందుకే కార్తిక పౌర్ణమిని ‘దేవతల దీపావళి’ అంటారు.

ఈ పర్వదినాన జ్వాలాతోరణం నిర్వహించడం సంప్రదాయం.

పాప ప్రక్షాళన
కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో రెండు కర్ర స్తంభాల మధ్య ఎండుగడ్డితో జ్వాలాతోరణం ఏర్పాటుచేస్తారు. ఆ జ్వాల కింది నుంచి మూడుసార్లు శివపార్వతుల పల్లకీని మోసుకెళ్తారు. ఇలా జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలూ తొలగి పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. దీనికి సంబంధించి పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. దేవతలు, రాక్షసులు క్షీర సాగరాన్ని మథించినప్పుడు… అమృతం కంటే ముందు హాలాహలం వెలువడింది. అది వినాశకరమైంది కాబట్టి దాన్నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. పరమశివుడు ఆ విషాన్ని తన గరళంలో నిక్షిప్తంచేశాడు. అందుకు భయపడిన పార్వతీదేవి- విషంవల్ల పతీశ్వరుడికి హాని కలగకూడదని మూడుసార్లు మండే జ్వాల కిందుగా నడిచింది.

నాటి నుంచి కార్తికపౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటుచేసి.. దాని కింది నుంచి నడవటం ఆనవాయితీగా మారింది. ఇలా చేయడంవల్ల ఆపదల నుంచి బయటపడొచ్చనే విశ్వాసం వేళ్లూనుకుంది. జ్వాలాతోరణం దర్శించుకున్నా, దాని కింద నడిచినా తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని, మూడుసార్లు జ్వాలాతోరణం దాటితే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

భక్తులు జ్వాలాతోరణం కోసం తెచ్చిన గడ్డిని, ఘట్టం ముగిశాక వచ్చిన భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. గడ్డిని గుమ్మంలో వేలాడదీసి, భస్మాన్ని ఇంటి ముందు చల్లుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత, ప్రేత, పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. యమలోక ప్రవేశద్వారం వద్దనున్న అగ్ని తోరణం దాటితేనే లోపలికి అడుగుపెట్టగలరని, పాపం చేసినవారికి తొలి శిక్ష ఇదేనని గరుడపురాణం తెలియజేసింది. అందువల్ల జ్వాలాతోరణం దాటినవారు పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని, నరకానికి వెళ్లరని చెబుతారు.

కార్తిక పౌర్ణమి రోజున భక్తులు ఉపవాసదీక్ష చేస్తారు. ఈ రోజున ఆలయంలో లేదా తులసికోట వద్ద మట్టి ప్రమిదలో మూడువందల అరవై ఐదు వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి దీపం వెలిగిస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజున దీపదానం చేయడం శ్రేష్ఠం. అలా చేయలేనివారు కొండెక్కిన దీపాలను వెలిగించినా, వెలుగుతున్న దీపాలు కొండెక్కకుండా చేసినా దీపదాన ఫలితం దక్కుతుందన్నది పెద్దల మాట.