
25views
జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (NCERT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల సైన్స్ పాఠ్య పుస్తకాల్తో ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుతామని ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (NEP)2020 కింద, విస్తృత దృక్పథంతో ఆయుర్వేదాన్ని చేర్చింది. ఆరో తరగతి నుంచి ఎనిమిది తరగతుల వరకూ క్యూరయాసిటీ పేరుతో NCERT సైన్స్ పాఠ్యపుస్తక శ్రేణిలో ఆయుర్వేదంపై ప్రత్యేక అధ్యాయాలు వుంటాయని పేర్కొంది.
శరీరం, మనస్సు మరియు పర్యావరణం మధ్య సమతుల్యతపై దృష్టి సారించే పురాతన భారతీయ వైద్య విధానం గురించి శాస్త్రీయ అవగాహన పొందడానికి విద్యార్థులకు సహాయపడటానికి ఈ అధ్యాయాలు ఉపయోగపడతాయని NCERT అభిప్రాయపడింది.
ఆయుర్వేదం అన్న విషయాన్ని సైన్స్ పాఠ్య పుస్తకాల్లో చేర్చడం ద్వారా సంప్రదాయ ఆరోగ్య పద్ధతులు, వాటి వివరాలతో పాటు ఆధునిక ప్రపంచంలో వాటి ఔచిత్యం గురించి విద్యార్థులలో అవగాహన తీసుకొస్తామని NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని ప్రకటించారు.ఆయుర్వేదం కేవలం పురాతన జ్ఞానంగా కాకుండా, జీవితంలో సమతుల్యత మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించే శాస్త్రంగా పరిచయం చేస్తున్నామని వివరించారు.
సైన్స్ సబ్జెక్టులతో పాటు, NCERT ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్-బీయింగ్ అనే కొత్త చొరవను అభివృద్ధి చేసింది, ఇది III నుండి X తరగతులను కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమం ఆయుర్వేద భావనలను యోగా, పోషకాహారం, వ్యాయామం మరియు సమతుల్య జీవనశైలిపై పాఠాలతో అనుసంధానిస్తుంది.
సాంప్రదాయ మరియు ఆధునిక విధానాలను కలపడం ద్వారా, కౌన్సిల్ విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యం, స్థిరత్వం, సంపూర్ణతకు విలువనిచ్చే సమగ్ర విద్యా విధానాన్ని పెంపొందించడానికి NCERTప్రయత్నిస్తోంది.
ఆపరేషషన్ సిందూర్ గురించి కూడా…
సీబీఎస్సీ స్కూళ్లలోని 3 నుంచి 12వ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ బోధనాంశంగా ఆపరేషన్ సిందూర్‌ను చేర్చింది. ఈ మేరకు రెండు మాడ్యూళ్ల రూపంలో పాఠ్యాంశంగా జోడించింది. ‘ఆపరేషన్ సిందూర్-ఒక వీర గాథ’ అనే మాడ్యూల్‌ను 3 నుంచి 8వ తరగతి వరకు, ‘ఆపరేషన్ సిందూర్- ఆత్మగౌరవం కోసం సాహసిక ఎదురు దాడి‘ అనే మాడ్యూల్‌ను 9 నుంచి 12వ తరగతి వరకు పాఠ్య ప్రణాళికలలో NCERT చేర్చింది. దేశ పరాక్రమం గురించి పాఠశాల విద్యార్థులకు తెలియజెప్పి.. వారిని చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఎన్‌సీఈఆర్‌టీ ఆపరేషన్ సిందూర్‌ను విద్యార్ధులకు పాఠ్యాంశంగా చేర్చినట్లు అధికారులు తెలిపారు. భారత్ పౌరులపై పాకిస్థాన్ ఉగ్రదాడి జరిపిన విధానాన్ని ఈ పాఠాల్లో పేర్కొన్నారు.
మన దేశ రక్షణ వ్యవస్థ సంసిద్ధత, అధునాతన టెక్నాలజీ పరిజ్ఞాన వినియోగం, ప్రపంచ దేశాల పాత్రను ఈ మాడ్యూల్ వివరిస్తుంది. ఉగ్రవాద ముప్పులకు మన దేశం ఎలా స్పందిస్తుంది? జాతీయ భద్రతలో డిఫెన్స్, డిప్లొమసీ, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? వంటి అంశాలను ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు అర్థం చేసుకోవచ్చు.
 
			




