News

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

27views

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస లొంగుబాటు చర్యల్లో భాగంగా తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్‌ జిల్లాలో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే కాంకేర్‌ జిల్లాలో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దాంతో ఈరోజు 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

గత కొన్నిరోజులుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. మావోయిస్టు కీలక నేతల దగ్గర్నుంచీ కింది స్థాయిలో పని చేసే వరకూ చూస్తూ ప్రతీ రోజూ లొంగిపోతూనే ఉన్నారు. పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్న, బండి ప్రకాష్‌లు లొంగిపోయారు. తెలంగాణ ఎస్‌ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్‌లో ఈ ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు.

ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ అభయ్‌, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు కొన్ని రోజుల క్రితం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం వారి వారిప్రాంతాల్లో పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ సక్సెస్‌ కావడంతో మావోయిస్టులు తమ ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.

కాగా, దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్‌ కగార్‌ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్‌కౌంటర్‌ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడంతో వారు లొంగిపోక తప్పడం లేదనేది అంగీకరించాల్సిన విషయం.