ArticlesNews

జీవన సూత్రాలు ఉపనిషత్తులు

32views

ప్రపంచం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, మనిషి అంతరంగంలో మాత్రం శాంతి కోసం అన్వేషణ ఆగలేదు. ఆధునికత, భౌతిక సుఖాలు పూరించలేని ఏదో ఒక శూన్యం మనిషిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే, మన పూర్వీకులు అందించిన ఉపనిషత్తుల జ్ఞానం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.

మన నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన తాత్విక పునాదిని ఉపనిషత్‌ (గురువు దగ్గర కూర్చుని తెలుసుకోవడం అని అర్థం) గ్రంథాలు అందిస్తాయి. నవజీవనాన్ని నిర్మించుకోవడానికి ఉపనిషత్తుల సమన్వయం ఎంతో ఉపకరిస్తుంది. నేటితరం ఎక్కువగా బాధపడేది అనిశ్చితి, ఒత్తిళ్లతోనే. ఆ దిశగా ఉపనిషత్తులు మనకు అతి ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తాయి. బాహ్య రూపం, పదవులు, ఆస్తులు తాత్కాలికమని, మనలో ఉన్నది శాశ్వతమైన, శక్తిమంతమైన ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఒత్తిడికి విరుగుడు ఇదే. శ్రీరాముడికి వశిష్ఠుడు ఉపదేశించినట్లుగా, ‘నువ్వు’ శరీరం కాదు, మనసు కాదు. కేవలం సాక్షి అనే జ్ఞానం స్థిరపడినప్పుడు చిన్న చిన్న వైఫల్యాలు, నిరాశలు మనల్ని కదిలించలేవు. ఒత్తిడికి లొంగిపోకుండా, నిజమైన అంతర్గత శక్తితో పనిచేయడం అలవడుతుంది. ఛాందోగ్యోపనిషత్తులోని ‘తత్త్వమసి’ (ఆ సత్యమే నువ్వు) అనే మహా వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఆధునిక సమాజానికి ఎంతో అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, సర్వజీవులలోనూ ఒకే చైతన్యం ఉందని, మనలో ఉన్న పరమాత్మే ఎదుటివారిలోనూ ఉందని గుర్తించడం మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ భావన మనలో సహానుభూతి, కరుణలను పెంచుతుంది. ఇతరుల పట్ల ద్వేషం, అసూయ లేకుండా ప్రేమతో మెలిగే గుణాన్ని అలవరుస్తుంది.

ఈశావాస్యోపనిషత్తు చెప్పే ప్రధాన సూత్రం- ఫలితం ఆశించకుండా కర్మ చేయమని. ఉపనిషత్తుల అధ్యయనం మనకు పని పట్ల కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. శ్రద్ధ మాత్రమే మన చేతిలో ఉందని, ఫలితం దైవ సంకల్పం లేదా ప్రకృతి నియంత్రణలో ఉందని తెలుస్తుంది. ఫలితంపై అధికారం లేదని గ్రహించినప్పుడు, భయం తగ్గి, మనం చేయగలిగే పనిపైనే దృష్టి ఉంటుంది. ఇది వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. మన జాతీయ చిహ్నంపై ఉన్న ‘సత్యమేవ జయతే’ అనే వాక్యం ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నది. జీవితంలో స్థిరమైన పునాది ఉండాలంటే, అది కేవలం సత్యం, ధర్మం మీదే ఆధారపడాలి. విలువలు లేని విజయం తాత్కాలికం. ఎన్ని ప్రలోభాలు ఉన్నా, సత్య మార్గాన్నీ, ధర్మబద్ధమైన జీవితాన్నీ ఎంచుకున్న వ్యక్తి ఎప్పుడూ పతనమవ్వడు. నిజాయతీ, నైతికతలతో కూడిన వ్యాపారాలు, వృత్తులే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయి.

ఉపనిషత్తులు కేవలం గ్రంథాలు కావు, అవి జీవన సూత్రాలు. అవి మనకు కొత్త లోకాన్ని చూపించవు, కానీ ఉన్న ప్రపంచాన్ని సరికొత్తగా, లోతుగా చూసే జ్ఞానాన్ని అందిస్తాయి. అప్పుడు ఆ ఉపనిషత్తుల వెలుగులో మన ప్రతి అడుగు మరింత దృఢంగా పడుతుంది.