
5views
దేశం కోసం జీవించే వ్యక్తులను, అవసరమైతే ప్రాణాలు సైతం అర్పించే వ్యక్తులను కూడా తయారు చేసే కేంద్రం ఆరెస్సెస్ శాఖ అని క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు లక్ష స్థలాల్లో 20 లేదా 30 మంది చొప్పున సుమారుగా 25 లక్షల మంది నమస్తే సదా వత్సలే మాతృభూమే అని ప్రార్థన చేస్తున్నారని, అలాంటి వ్యవస్థ ఆరెస్సెస్ లోనే వుందని గుర్తు చేశారు. ‘‘గోవా విముక్తి పోరాటంలో RSS స్వయంసేవకులు’’ అన్న అంశంపై హైదరాబాద్ లో చింతన్, సూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భరత్ కుమార్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి ఒడి ఖాళీ కావొచ్చు కానీ.. తల్లి గర్భం ఎప్పుడూ ఖాళీగా వుండదని, అలాంటి గొప్ప చరిత్ర భారత మాతది అని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్ర, దేశం కోసం ఉరితాళ్లను కూడా ముద్దాడే చరిత్ర కేవలం భారత్ లోనే వుందన్నారు. శత్రువుల తలలతో బంతులాట లాడిన భూమి భారత్ భూమి అని తెలిపారు.
స్వాతంత్రం తర్వాత కొన్ని రోజులకు నైజాం నుంచి విముక్తం అయ్యామని, అలాగే చిన్న ప్రాంతమైన గోవాను విముక్తం చేసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టిందన్నారు. గోవా విముక్తి సమయంలో పోర్చుగ్రీసు సైనికులు 3 వేలకు పైగా వున్నారని, అదే ప్రజలు సుమారు 4 లక్షల వరకున్నారని, అయితే.. విముక్తం చేసుకోలేకపోయామన్నారు. మన బలహీనత ఎంత వుందో అర్థం చేసుకోవచ్చని, ఈ బలహీనతను కాస్తా బలంగా మార్చుకోవాలన్నారు.
కళ్లు మూస్తే దైవం.. కళ్లు తెరిస్తే దేశం కనిపించాలని అంటారని, దైవం పట్ల శ్రద్ధ, విశ్వాసం వుండటం ఎంత ముఖ్యమో… ఈ భూమి పట్ల అలాంటి భక్త భావన వుండాలని సూచించారు. 2017 లో విజయవాడ ఆరెస్సెస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ వారు వచ్చారని, దైవ భక్తి కంటే దేశభక్తే గొప్పదని చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత విజయేంద్ర సరస్వతీ స్వామి వార్ని దీనిపై అడిగితే.. దైవభక్తిలో వ్యక్తిగత స్వార్థం వుంటుందని, దేశ భక్తిలో ఆ స్వార్థం కూడా వుండదని, అందుకే దైవ భక్తి కంటే దేశభక్తే గొప్పదని వివరించారని పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తితో 18 ఏళ్ల సీతారాం శాఖకు వస్తూ.. ఇక్కడ వుండే వ్యక్తికి గోవా మట్టి ముద్ద మాత్రమే కాదని, ఈ దేశంలో భాగమని, దీని విముక్తి కోసం ఆరుగుర్ని తీసుకొని వెళ్లారని అన్నారు. మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు వున్నారని, ఇలాంటి భావాలను జాగృతం చేసి, హృదయంలో నింపేదే ఆరెస్సెస్, ఆరెస్సెస్ శాఖ అని వివరించారు.
స్వాతంత్రం తర్వాత జమ్మూ కశ్మీర్ ను విలీనం సమయంలో పాక్ దాడి చేసిందని, దీంతో స్వయంసేవకులు తరలి వెళ్లారని, ఆయుధ సామాగ్రి పడిపోతే, పాకుతూ పాకుతూ స్వయంసేవకులు వెళ్లారని, సైనికులకు ఇచ్చారని, మధ్యలో కొందరి స్వయంసేవకుల ప్రాణాలు కూడా పోయాయని పేర్కొన్నారు. ఈ దేశం సైనికులు యుద్ధం చేస్తున్నారని, వారికి సహకరించాల్సిన బాధ్యత తమదన్న గురుతర బాధ్యతను భుజాలకెత్తుకున్నారని అన్నారు.

అలాగే చైనాతో యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు గాయాలయ్యాయని, రక్తం కావాలని సమాచారం అందిందని, దీంతో నాలుగు వేల మంది స్వయంసేవకులు రక్తం ఇవ్వడానికి బారులు తీరారని అన్నారు. దీనిని చూసి ఆర్మీ అధికారులే ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు.‘‘మీకు ప్రచారం రాదు, ఫొటోలు కూడా తీయము.. ఎందుకు వచ్చారు?’’ అని ఆర్మీ అధికారులు ప్రశ్నించారని… దీనికి స్వయంసేవకులు బదులిస్తూ.. ‘‘శాఖలో కబడ్డీ, ఆటలు ఆడుకుంటాం. ఆ సమయంలో జై జై మాత భారత మాత అని నినాదాలిస్తాం. దీనితో పాటు.. జాన్ భీ దేంగే.. ఖూన్ భీ దేంగే అని కూడా నినాదాలిస్తాం. ఇవేవీ గాలిలో కలిసిపోలేదు. మా రక్తంలో కలిసిపోయింది. సమాచారం అందింది. వెంటనే రక్తం ఇవ్వడానికి వచ్చాం’’ అని బదులిచ్చారని పేర్కొన్నారు. ఇదేమీ మట్టి ముద్ద కాదని, ఇది మాతృభూమి అని భావన వుంటుందని, అందుకే ఏ బాధ వచ్చినా.. దానిని నివారించాలన్న బాధ స్వయంసేవకుల్లో వుంటుందన్నారు. మిగతా వారికి కూడా ఈ భావన వుంటుందన్నారు.

1977 లో వచ్చిన తుపాను సమయంలో విపరీతమైన బీభత్సం జరిగిందని, పది వేల మంది చనిపోయారని, వేల పశుకళేబరాలు కూడా పడి వున్నాయి. దేశం నుంచి స్వయంసేవకులు వచ్చారు. సేవ ప్రారంభించారు. భయంకరమైన శవాల వాసన. శవాలను దహనం చేశారు. శవసేన అని పేరు కూడా పెట్టారు. అక్కడ వుండే ప్రభాకరన్ గారు ‘‘రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్’’ అని పేరు పెట్టారు. శాఖలో శవాలను ఎలా తీయాలి? శవ దహనం నేర్పరు. కానీ ఈ భూమి కన్నతల్లి, ఈ ప్రజలు నా వాళ్లు అన్న భావన నింపుతాం. అందుకే ప్రజలను కష్టాల నుంచి దూరం చేయడానికి ఎలాంటి బాధనైనా భరిస్తారు. ఇది సంఘ శాఖకు వచ్చే వ్యక్తి మైండ్ సెట్’’ అని తెలిపారు.
మాజీ ప్రధాని నెహ్రూ సంఘ్ పై నిషేధం విధించారని, అలాగే గురూజీని జైళ్లో కూడా పెట్టారని, అలాంటి నెహ్రూ ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు ప్రధాని హోదాలో వెళితే.. కొందరు నల్లా జెండాలు చూపించారని, ఆ సమయంలో గురూజీ బాధపడ్డారన్నారు. ఎందుకంటే సంఘ్ పై ఆయనకు వ్యతిరేకత వుండొచ్చు కానీ… ఆయన ఈ దేశ ప్రధాని అని, ఇదే దేశంలో వారికి అవమానం జరగడం సముచితం కాదని అన్నారన్నారు.
పార్టీకి, సిద్ధాంతానికి అతీతంగా ఈ దేశాన్ని ప్రేమించే, వ్యవస్థను గౌరవించే మనస్తత్వం సంఘ స్వయంసేవకులలో వుంటుందన్నారు. అలాంటి భావన కలిగిన వారు దేశానికి ఏ అవసరం వచ్చినా ముందుంటారని అన్నారు. ఈ ప్రేరణతోనే సూరి సీతారాం దేశం కోసం ప్రాణాలిచ్చారని భరత్ కుమార్ పేర్కొన్నారు.





