
22views
కేరళలోని తంత్రవిద్యా పీఠం జారీ చేసే సర్టిఫికేట్లు ఆలయ అర్చకులుగా నియుక్తి కావడానికి కావాల్సిన అర్హతను ధ్రువీకరిస్తాయని కేరళ హైకోర్టు అక్టోబర్ 23 న తీర్పునిచ్చింది. ఈ పీఠం జారీ చేసే సర్టిఫికేట్లు అర్చకులుగా నియుక్తి కావడానికి కావల్సిన అర్హతను కూడా అందిస్తాయని,హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా తిరువితంకూర్ దేవస్వం బోర్డుకే సంబంధించింది అయినప్పటికీ.. ఇతర దేవస్వం బోర్డులైన మలబార్, కూడల్మాణిక్యం, గురువాయూర్ దేవస్వమ్ బోర్డులకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
తమ సంస్థలో మాత్రమే శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రత్యేక అర్హత కల్పించాలని కోరుతూ కేరళ తాంత్రి సమాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.ఈ తీర్పు ప్రకారం ఇప్పుడు తంత్రవిద్యలో శిక్షణ పొందిన అభ్యర్థులను, వారు పుట్టుకతో బ్రాహ్మణులు కాకపోయినా, ఆలయ పూజారులుగా నియమించుకోవడానికి అనుమతిస్తుంది.
అయితే అర్చకత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న కొందరి అభ్యర్థుల అర్హతలను సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టుకు వెళ్లారు. సమానత్వం, రాజ్యాంగ సూత్రాలను తిరస్కరించే సంప్రదాయాలను తాము రక్షించలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అర్చక నియామకాలు అనేవి కులం, వంశపారంపర్యంగా కాకుండా అర్హతల ఆధారంగానే వుండాలని సూచించింది.

తంత్ర విద్యాలయాలు విశ్వసనీయంగానే ప్రక్రియలను నిర్వహిస్తాయని, ఈ పిటిషనర్లలో ఒకరు వాటిలో పాల్గొన్నారని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అర్హతలను అంచనా వేయడానికి మరియు ప్రమాణాలను రూపొందించడానికి రిక్రూట్‌మెంట్ బోర్డుకు నైపుణ్యం లేదని పిటిషనర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. కొన్ని సంప్రదాయాలు రాజ్యాంగం కంటే ముందే ఉన్నప్పటికీ, మానవ హక్కులు, పౌర చట్టాలు లేదా సామాజిక సమానత్వాన్ని ఉల్లంఘించే ఏ సంప్రదాయాన్ని చట్టబద్ధంగా సమర్థించలేమని కోర్టు తీర్పు చెప్పింది.ఈ తీర్పు నేరుగా తిరువితంకూర్ దేవస్వం బోర్డుకు సంబంధించినది అయినప్పటికీ, ఇది ఇతర దేవస్వం బోర్డులకు కూడా విస్తరించే అవకాశం ఉంది.
తంత్ర విద్యా పీఠాన్ని ఆరెస్సెస్ ప్రచారక్ పి. మాధవన్ జీ స్థాపించారు. ఆయన సమయంలో ప్రముఖ తంత్ర విద్యా పండితుడు, కేరళలో ఎక్కువ మందికి ఆమోదయోగ్యంగా వుండే పాలియం విళంబరం మార్గదర్శకత్వంలో ఇది ప్రారంభమైంది. 1988లో ఆయన మరణించిన తర్వాత, అక్టోబర్ 9న మరణించిన RSS మాజీ ప్రాంత్ సంఘచాలక్ P.E.B. మీనన్ పీఠానికి నాయకత్వం వహించారు. ఇది కులంతో సంబంధం లేకుండా అర్చకత్వ ఆశయాలకు శిక్షణ ఇస్తూనే ఉంది.





