News

పాక్‌ నుంచి బంగ్లాకు.. ఉగ్రవాదం ఎగుమతి

0views

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి బంగ్లా-పాక్‌ దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తయ్యిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు ఇలాహి జహీర్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు పలువురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జహీర్ అక్టోబర్ 25న ఢాకాకు చేరుకున్నాడని.. నాటి నుంచి భారత సరిహద్దులో ఉన్న బంగ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో అతడు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు కూడా చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిపాయి.

మరో 12 రోజులు బంగ్లాలోనే ఉండనున్న హఫీజ్ సయీద్ సన్నిహితుడు నవంబర్ 6-7 తేదీల్లో రాజ్‌షాహిలో జరిగే భారీ ఇస్లామీ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో యూనస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జహీర్‌ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2025లో అతడు వారం రోజులకు పైగా బంగ్లాదేశ్‌లో పర్యటించాడు. దీంతో 26/11 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ బంగ్లాలో తన ప్రభావాన్ని వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌ జనరల్‌ షంషాద్‌ మీర్జా కూడా తాజాగా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లారు. భారత్‌లో మనీలాండరింగ్, ఇతర నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ సైతం నేడు బంగ్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పాక్‌ జనరల్‌కు యూనస్ ‘Art of Triumph’ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు చూపిస్తున్న వక్రీకరించిన మ్యాప్‌ను చిత్రీకరించారు. ఈ విధంగా భారత వ్యతిరేక శక్తులన్నీ బంగ్లాలో ఒక్కచోటికి చేరుతుండడంతో ఈశాన్య భారత్‌పై వీరు ఏదైనా కుట్ర పన్నుతున్నారా అని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలను భారత భద్రతా బలగాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి.