News

ఆరెస్సెస్‌ కార్యకలాపాల ఆంక్షలపై సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

46views

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్-ఆరెస్సెస్‌ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారంలో కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరెస్సెస్‌కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ నవంబరు 17వ తేదీకి వాయిదా వేసింది.

ఏవైనా ప్రైవేటు సంస్థలు లేదా సంఘాలు తమ కార్యకలాపాల కోసం.. ప్రభుత్వ మైదానాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల ఆవరణలను వినియోగించుకోవాలని అనుకుంటే.. తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అక్టోబరు 18న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది.

సంఘ్‌ ఏర్పడి వందేళ్లయిన నేపథ్యంలో భారీస్థాయిలో కవాతులు నిర్వహించేందుకు సిద్ధమైన వేళ ఈ ఉత్తర్వులు రావడంతో దీనిపై తీవ్ర వివాదం నెలకొంది. రాష్ట్రంలో ఆరెస్సెస్‌ను నిషేధించడమే లక్ష్యంగా సిద్ధూ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని బిజెపి నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రైవేటు సంస్థల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.