
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి భారత్‌తో దౌత్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయన తాజాగా మరోసారి భారత్‌పై విషం కక్కారు. భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. ఆ మ్యాప్‌లో భారత ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌లో భాగంగా చిత్రీకరించారు.
యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి పాక్-బంగ్లా దగ్గరవుతున్నాయి. దీనిలో భాగంగా పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్‌పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా యూనస్-మీర్జా భేటీ అయ్యారు. అప్పుడు పాక్ జనరల్‌కు యూనస్ ‘Art of Triumph’ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు అందులో భాగంగా కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆయన చర్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.
మన ఈశాన్య ప్రాంతంపై యూనస్ అక్కసు వెళ్లగక్కడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలో పర్యటించిన సందర్భంగా ‘‘భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యలు చేశారు. మరో సందర్భంలో.. బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వాటికి అప్పట్లోనే భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘బంగాళాఖాతంలో భారత్‌కు 6,500 కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగిఉంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే.





