
భారతీయ జాతీయ గేయమైన వందేమాతరం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 127 వ భాగంలో ప్రసంగించారు.
వందేమాతరం పాటలోని మొదటి పదమే మన హృదయాలలో భావనల ఉప్పెనను రేకెత్తిస్తుంది. వందేమాతరం అనే ఒకే శబ్దంలో ఎన్నో భావాలున్నాయి. ఎన్నో శక్తులున్నాయి. సహజమైన భావంలో ఇది మనకు భారతమాత వాత్సల్యాన్ని చవిచూపిస్తుంది. ఇదే పదం మనల్ని భారతమాత బిడ్డలుగా తన దివ్యత్వాన్ని బోధిస్తుంది. కఠిన సమయంలో వందేమాతరం అనే నినాదం 140కోట్ల భారతీయులను ఐకమత్యమనే శక్తితో నింపేస్తుందన్నారు.
దేశభక్తి, భరతమాతను ప్రేమించడం అనేది పదాలకు మించిన భావన అయితే వందేమాతరం ఆ రూపంలేని భావనకు సాకారమైన స్వరాన్ని అందించే గీతం. శతాబ్దాల బానిసత్వంతో శిధిలమైన భారతదేశంలో కొత్త ప్రాణాన్ని నింపడానికి బంకీం చంద్ర చటోపాధ్యాయ్ గారు ఈ గీత రచనను చేశారు. పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ రచన జరిగినా కూడా దీనిలోని భావన కొన్నివేల ఏళ్ళనాటి భారతదేశపు అమరమైన చైతన్యంతో ముడిపడి ఉంది. ఇదే భావాన్ని వేదాలలో – “माता भूमि: पुत्रो अहं पृथिव्या:” ( Earth is the mother and I am her child) అంటూ భారతీయ సభ్యతకు పునాదిని వేశారు . అంటే – భూమి మాత, నేను ఆమె పుత్రుడిని అని అర్థం. బంకించంద్ర గారు వందేమాతరాన్ని రచించి మాతృభూమికి, ఆమె సంతానానికి ఉన్న బంధాన్ని భావప్రపంచంలో ఒక మంత్ర రూపంగా బంధించేశారని తెలిపారు.
వందేమాతరం కొద్ది రోజులలో అంటే, నవంబర్ ఏడవ తేదీన మనం వందేమాతరం తాలుకు 150వ ఉత్సవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని.. నూట ఏభై ఏళ్ల క్రితం వందేమాతరం రచన జరిగింది. 1896 లో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటిసారిగా ఈ గీతాన్ని ఆలపించారు. మిత్రులారా, వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడల్లా కోట్లమంది దేశ ప్రజలు ఎల్లప్పుడూ ఉప్పెనలా పొంగిన దేశ ప్రేమను చవి చూశారు. మన తరాలన్నీ వందేమాతరం పదాలలో భారతదేశపు సజీవమైన భవ్య రూపాన్ని దర్శించాయని పేర్కొన్నారు.
సుజలాం సుఫలాం మలయజ శీతలాం,
సస్యశ్యామలామ్ మాతరం, వందేమాతరం!
మనం ఇటువంటి భారతదేశాన్ని తయారుచెయ్యాలి. వందేమాతరం మన ఈ ప్రయత్నాలలో ఎల్లప్పుడూ మనకు ప్రేరణగా ఉంటుంది. అందువల్ల మనం వందేమాతరం తాలుకు 150వ సంవత్సరాన్ని కూడా చిరస్మరణీయంగా మార్చుకోవాలి. రాబోయే తరాల కోసం ఈ సంస్కార ప్రవాహాన్ని మనం ముందుకు నడిపించాలి. రాబోయే కాలంలో వందేమాతరంతో ముడిపడిన అనేక కార్యక్రమాలు రాబోతున్నాయి. దేశంలో ఎన్నో ఏర్పాట్లు జరుగుతాయి. మన దేశప్రజలందరూ వందేమాతరం గౌరవార్థం స్వయంస్ఫూర్తితో ప్రయత్నం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మీ సూచనలను నాకు #VandeMatram150 కు తప్పకుండా పంపించండని కోరారు.





