News

తాళపత్రాల్లో ఏముందో తెరపై చూసేద్దాం

55views

ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం తాళపత్రాలపై రాసిన కావ్యాలలోని లిపిని, భాషను కృత్రిమమేధ(ఏఐ) ద్వారా డిజిటలీకరించారు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఆచార్యులు ప్రొఫెసర్‌ రవికిరణ్‌. పదమూడో శతాబ్దపు కశ్మీర్‌ కావ్యాలను డిజిటల్‌ ప్రతుల్లోకి మార్చారు. ఇందుకోసం ఏఐతో అనుసంధానమైన ‘ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌(ఓసీఆర్‌)’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. తొలుత శారద లిపిలో రాసిన కావ్యాలను స్కాన్‌ చేశారు. అందులోని లిపిని బొమ్మలు, సంజ్ఞల రూపంలోకి మార్చారు. ఈ రెండింటినీ ఏఐతో తాళపత్ర గ్రంథాల్లోని కావ్యాల రూపానికి తీసుకొచ్చారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాలో భద్రపరిచిన తాళపత్రాలలో పోల్చారు. డిజిటలీకరణ సరిపోయిందని కశ్మీర్‌లోని చరిత్ర పరిశోధకులతో ధ్రువీకరించుకున్నారు. 15వేల కావ్యాలను డిజిటల్‌ గ్రంథాలయంలో భద్రపరిచారు. దేశవ్యాప్తంగా 50 లక్షల తాళపత్ర గ్రంథాలను డిజిటల్‌ రూపంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మిషన్‌ జ్ఞాన్‌భారత్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రాథమిక దశలో ‘జ్ఞానసేతు’ ఛాలెంజ్‌ పేరుతో పరిశోధకులు ఇష్టమైన తాళపత్ర గ్రంథాలను తీసుకుని డిజిటల్‌లోకి మార్చాలని కొద్దినెలల క్రితం సూచించింది. ప్రొఫెసర్‌ రవికిరణ్‌ కశ్మీర్‌ కావ్యాలను ఎంపిక చేసుకుని పోటీలో పాల్గొని రెండో బహుమతిని సాధించారు. దిల్లీలో కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ శెఖావత్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు.