News

వనవాసీ కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో 111 చెంచు జంటల వివాహం

72views

సమాజంలో ఎంత సంఖ్యలో ఉన్నాం అన్నది ముఖ్యం కాదనీ.. ఉన్నవాళ్లలో ఐకమత్యం, వాళ్లలోని శక్తే కీలకమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. సమాజంలో చెంచులు బలమైన శక్తిగా ఎదగాలని, వారికి సామూహిక వివాహాలు జరిపించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో వనవాసీ కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన.. 111 చెంచు జంటల సామూహిక వివాహ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెంచు మహిళలు సంప్రదాయ నృత్యం చేస్తూ.. గవర్నర్‌ను వేదిక వద్దకు తీసుకెళ్లారు. హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హైకోర్టు జడ్జి జస్టిస్‌ మాధవిదేవితో కలిసి గవర్నర్‌ జ్యోతిని వెలిగించి మాట్లాడారు. సనాతనధర్మంలో కన్యాదానం మహాదానమని, చెంచు జంటల వివాహాలకు తామంతా సాక్షులుగా నిలిచామన్నారు.

హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని, చెంచులు, ఆదివాసీలు విద్యలో రాణించి గొప్పస్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవిదేవి మాట్లాడుతూ.. నూతన వధూవరులు కలసిమెలసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వనవాసీ కల్యాణ ఆశ్రమం ఉపాధ్యక్షుడు నాగ్‌జీ, రాష్ట్ర అధ్యక్షుడు కాట్రాజ్‌ వెంకటయ్య, రాష్ట్ర కార్యదర్శి డీవీ రావు, అఖిల భారత కమిటీ సభ్యుడు రామచంద్రయ్య, మహిళా ప్రముఖ్‌ గుర్రం శకుంతల, రేఖా నాగర్, ఆదిత్య పరాశ్రీ స్వామిజీ, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.