News

సేంద్రియ వరి.. పోషకాల సిరి

53views

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామాన్ని స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ త్రూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీఐఎస్‌టీ) బృందం సందర్శించింది. వీరు గ్రామంలో సర్పంచి, రైతు పాటిబండ్ల కృష్ణప్రసాద్‌ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన వరి పంటకు ‘బ్రిక్స్‌’ విలువ లెక్కించగా 18 నమోదైంది. ఇదే ప్రాంతంలో రసాయనాలతో సాగుచేసిన పంటకు కేవలం ‘5’ వచ్చింది. దీంతో బృంద సభ్యులైన ఆండ్రీ హాఫ్‌మన్, రోజాలీ హాఫ్‌మన్‌ తదితరులు రైతు కృషిని అభినందించారు. కృష్ణప్రసాద్‌ 55 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

అసలేంటీ విలువ?
వరి చేలో పోషక విలువలు, చీడపీడల్ని తట్టుకునే శక్తిని బ్రిక్స్‌ విలువతో నిర్ధారిస్తారు. ఈ విలువ 12కు పైన ఉంటే ఆరోగ్యకరమైన పంటగా… 10 కంటే తక్కువగా నమోదైతే పోషక విలువలు అత్యంత తక్కువగా ఉన్నట్లు చెబుతారు. ‘రిఫ్రాక్టోమీటర్‌’ అనే పరికరంలో వరి కంకి నుంచి తీసిన రసాన్ని ఉంచి ఈ విలువను శాస్త్రీయంగా లెక్కిస్తారు.

జీఐఎస్‌టీ బృందం పర్యటన వివరాలను ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రాజకుమారి వివరించారు. ‘‘యూరియా, డీఏపీ వంటివి వాడకుండా సహజసిద్ధంగా తయారయ్యే నీమాస్త్రం, ఘన, ద్రవ జీవామృతాలు వాడడం వల్లే బ్రిక్స్‌ విలువ మెరుగ్గా వచ్చింది. ఖర్చులు తగ్గాయి. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యవంతమైన ఉత్పత్తి సాధ్యమవుతుంది. శాస్త్రీయ అధ్యయనంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం’’ అని ఆమె వివరించారు. క్షేత్ర పరిశీలన తర్వాత గ్రామంలో విదేశీ బృందం రైతులతో చర్చాగోష్ఠి నిర్వహించింది. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌ సంధానకర్తగా వ్యవహరించారు.