News

ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు – స్వదేశీ, స్వభాషా, స్వభూష

15views

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని ఆం.ప్ర రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో “ఆత్మనిర్భర్ భారత్” అంశంపై మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్‌ గారు విశిష్ట ఉపన్యాసం ఇచ్చారు. తన ప్రసంగంలో ఆయన “ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు స్వదేశీ, స్వభాషా మరియు స్వభూష” అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ మూడు అంశాల ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తల్లిభాషపై గర్వం కలిగి ఉండాలని, మన సంస్కృతి, వారసత్వాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు.

అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ దేశమంతా స్వదేశీ నినాదం ఆత్మ నిర్భర్ భారత్ పై భారత ప్రధాని ఇక పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి, అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దీని యొక్క ఆవశ్యకత పదేపదే మన భారత ప్రధాని తెలుపుతున్నారు. ఏ దేశమైన ప్రగతి సాధించాలంటే ఇతర దేశాల ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వదేశీయంగా మనమే తయారు చేసుకున్న ఉత్పత్తులను, టెక్నాలజీ, ఆవిష్కరణలు ఉత్పత్తులు చేయగలిగితే మన స్వదేశీ అవసరాలు తీరడమే కాకుండా ఎగుమతులను కూడా మనం చేసే అవకాశం ఉంటుంది అన్నారు. ప్రపంచంలో 11 వ స్థానంలో ఆర్థికంగా ఉన్న మన దేశం కొన్ని సంవత్సరాలలోనే ఆర్థిక ప్రగతి సాధించి నాలుగో స్థానానికి చేరినదనీ, 2030 నాటికి మూడవ స్థానానికి, 2047 సంవత్సరానికి మొదటి లేదా రెండవ స్థానానికి చేరుకుంటామని అనేక విదేశీ సంస్థలు, ఏజెన్సీలు అంచనాలు వేస్తున్నాయి అని తెలిపారు. మన దేశం ముందుకు అభివృద్ధి పథంలో సాగుతోందనీ, ఉత్కృష్టమైన సంస్కృతి, ఘనమైన వారసత్వ సంపద కలిగిన మన భారతదేశంలోనే ఉత్పత్తుల తయారీ చేపట్టి దిగుమతుల స్థాయి నుండి మన ఉత్పత్తులను ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రచారము చేయడం వలన, అవగాహన కల్పించడం వలన వాటిని ప్రమోట్ చేయడం జరుగుతోందని ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టి స్టార్ట్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అలాగే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి స్ధానికంగా ఉద్యోగ ఉపాధి కల్పించే దిశగా అనేక వినూత్న కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. స్వదేశీ టెక్నాలజీతో మనం హెలికాప్టర్లను, స్వదేశీ విమాన ఇంజన్ల తయారీ చేసుకోగలుగుతున్నాం, అంతే కాకుండా చందమామ దక్షిణ ధృవం చేరుకుని చరిత్ర సృష్టించామని, డిఫెన్స్ పరికరాల తయారీ చేసుకోగలుగుతున్నామని, అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతున్నాం, తద్వారా అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా స్వదేశీ నినాదం ఎంతగానో స్వతంత్ర భారతావని సాధనకు ఒక ముఖ్య కారణమైందని, ఉత్కృష్టమైనటువంటి నిర్మాణాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అలాంటి స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ కు మనం అందరం పునరంకితమై విస్తృతంగా ప్రచారం చేసి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించి స్వదేశీ వస్తువుల తయారీ చేయడంలో, దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుదామని మంత్రి పిలుపునిచ్చారు.