
భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా రూపంలో ఓ ఆశ పాకిస్తాన్‌కు చిగురించింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఇప్పుడు ఆ దేశం సిద్ధంగా ఉంది. ఇటీవల, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా ఇద్దరి పై జరిగినట్లే అని పాకిస్తాన్ ప్రగల్భాలు పలికింది.
ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా పాకిస్తాన్ కు 10 బిలియన్లు పెట్టుబడి ప్యాకేజీని అందించనుంది. అయితే, దీనికి ప్రతిగా దాదాపుగా 25,000 మంది పాక్ సైనికుల్ని సౌదీ అరేబియాలో మోహరించాలని అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఆర్మర్స్, ఫిరంగి, పదాతిదళం, రాకెట్ యూనిట్లతో కూడిన నాలుగు ఆర్మీ బ్రిగేడ్‌లను, రెండు వైమానిక దళ స్క్వాడ్రన్‌లు, రెండు నావికా దళాలను మోహరించడం జరుగుతుంది. ఒక లెఫ్టినెంట్ జనరల్ నేతృత్వంలో ఇవన్నీ పనిచేస్తాయి. ఇద్దరు మేజర్ జనరల్స్, 8 మంది బ్రిగేడియర్లు సహాయం చేస్తారు. వీరంతా సౌదీ సైన్యంతో ఉమ్మడి కార్యకలాపాలు, శిక్షణ వంటి వాటిలో పాల్గొంటారు. పాకిస్తాన్‌కు ఎయిర్ డిఫెన్స్, రాకెట్ కమాండ్ నిర్మాణాలకు సౌదీ సహాయం చేయనుంది.
అయితే, ఈ ఒప్పందంపై చైనా ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ కు అందిన చైనీస్ సాంకేతిక కూడా సౌదీ అరేబియాకు బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు 5వ తరం యుద్ధవిమానాల అభివృద్ధిలో సహకరించే ప్రణాళికలు ఉన్నాయి. సౌదీ JF-17, J-10 యుద్ధ విమానాలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేసినట్లు అవుతుంది.
మరోవైపు, పాకిస్తాన్‌కు సౌదీ పెట్టుబడుల రూపంలో సాయం చేయనుంది. మౌలిక సదుపాయాలు, ఇంధనం, మైనింగ్, భద్రతా రంగాల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని అందుకుంటుంది. అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ నిల్వల సమస్యల నుంచి పాకిస్తాన్‌ను గట్టెక్కించడం ఈ ఆర్థిక ప్యాకేజీ లక్ష్యం. సౌదీ అరేబియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ నుంచి 15 బిలియన్ డాలర్లకు పెంచాలని, ఆఫ్ఘానిస్తాన్, భారత్ వంటి దేశాలతో దౌత్యపరంగా పాకిస్తాన్ కు సాయం చేయాలని యోచిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే దేశ రక్షణ కోసం వాడాల్సిన సైన్యంతో పాకిస్తాన్ వ్యాపారం చేస్తోందని దీంతో స్పష్టమవుతోంది.





