ArticlesNews

పర్వదినాల కార్తికం

42views

కృత్తికా నక్షత్రం పౌర్ణమినాడు ఉండే మాసం కార్తికం. ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా లౌకిక, అలౌకిక, జ్ఞానాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. కార్తికం పర్వదినాల మాసం. అందుకే ‘న కార్తిక సమో మాసః’ (కార్తికానికి సమానమైన నెల మరొకటి లేదు) అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాస దీక్షను విరమించే సంప్రదాయం కార్తికానికే ప్రత్యేకం.

దీపావళి తరవాత పాడ్యమి నుంచి కార్తికం మొదలవుతుంది. దీనికి ‘కౌముది’(వెన్నెల) మాసమని పేరుంది. సంవత్సరంలో శైవ, వైష్ణవ భగవదారాధనకు మిక్కిలి అనువైన మాసమిది. కార్తికంలో తెల్లవారుతూనే స్నానం చేయడం వల్ల కాయక, వాచిక, మానసికాది దోషాలు పోతాయంటారు. పగటి కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దునంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే ‘నక్త వ్రతం’ గురించి పద్మ, స్కాంద పురాణ కథల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో సోమవార ఉపవాస దీక్ష కూడా విశేషమైంది. ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం, ఆ చెట్టు కింద పూజ, ప్రదక్షిణలు, భోజనం… ప్రత్యేకంగా చేయదగిన పనులుగా పౌరాణికులు చెబుతారు.

యమద్వితీయగా పేరొందిన విదియ నాడు సోదరి ఇంట భోజనం చేయాలని వ్రత గ్రంథాలు తెలుపుతున్నాయి. కార్తిక శుద్ధ చవితి నాగుల చవితి. ఆరోజు నాగవ్రతం చేయాలని, నాగులను పూజించాలని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం సూచిస్తోంది. కార్తిక శుద్ధ ఏకాదశి (ప్రబోధనైకాదశి) చాతుర్మాస దీక్షకు ముగింపు. మర్నాడు క్షీరాబ్ధి ద్వాదశి. విష్ణువు క్షీరాబ్ధి నుంచి లక్ష్మీ, బ్రహ్మ తదితరులతో కలిసి తులసి బృందావనానికి వచ్చి భక్తులతో పూజలు అందుకుంటాడు.

కార్తికం దీపాల మాసం కూడా. ఈ నెలలో చేసే దీప దానం ప్రశస్తమైంది. దానివల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కార్తిక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అనీ అంటారు. ఆనాటి మునిమాపు వేళ ఈశ్వర ప్రీతి కోసం దీపాలను వెలిగిస్తారు. ఈరోజు చేసే మరొక ప్రత్యేక ఉత్సవం జ్వాలాతోరణం. దీని గురించి పలు పురాణగాథలు ఉన్నాయి. క్షీరసాగర మథనం వేళ పుట్టిన హాలాహలాన్ని శంకరుడు లోకహితార్థం తన కంఠంలో నిలిపి వేస్తాడు. దాంతో ఆందోళన చెందిన పార్వతీదేవి ఈ గండం నుంచి బయటపడితే తాను కుటుంబ సహితంగా చిచ్చుల తోరణం కింద ముమ్మారు దూరి వస్తానని మొక్కుకుందట. అప్పటినుంచి జ్వాలాతోరణ ఉత్సవం ఏర్పడిందంటారు. ఆరోజు శివాలయాలలో ఎండు గడ్డితో తోరణాన్ని కట్టి, వెలిగిస్తారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి మండుతున్న ఆ జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు తిప్పుతారు. కార్తిక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని ‘స్మృతి కౌస్తుభం’ అనే గ్రంథం చెబుతోంది. తెల్లారగట్టే స్నానాలు, ఉపవాస దీక్షలు, దీప దానాలు ఇలా ఎన్నో పుణ్యకార్యాలను ఆచరించే పవిత్ర మంగళకర మాసం కార్తికం. వనభోజనాలతో అందరికీ ఆనందోత్సాహాలను అందించే ఆహ్లాదకర సమయం కూడా ఇది!