ArticlesNews

వృక్షం.. ప్రత్యక్ష దైవం

84views

ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంతచిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవకృప కోసం గుడికి వెళ్తుంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్లాలి- అన్నది పెద్దల మాట. ఇది అక్షరసత్యం కదూ! చుట్టూ చెట్లుంటే.. ఆకాశమంత ఆనందం, భూదేవంత ఆహ్లాదం. అన్నిటినీ మించి ఆధ్యాత్మికచింతనకు ఆలవాలమవుతుంది. ప్రకృతి ఒడిలో ఇహలోక చింతలు తీరి దేవుడికి చేరువయ్యే అపూర్వ అవకాశం లభిస్తుంది.

మనం తినే ఆహారం, ధరించే దుస్తులు, నివసించే ఇల్లు.. అన్నిటికీ చెట్లే ఆధారం. మొక్కల్లేకుంటే మనకు మనుగడే లేదు. అందుకే వృక్షాల్ని దైవంగా భావించి పూజిస్తాం. అవి నిత్యావసరాలను తీర్చడమే కాదు.. ఆధ్యాత్మిక చింతనను పెంచిపోషిస్తాయి. పురాణేతిహాసాలను అనుసరించి.. బ్రహ్మకు మర్రిచెట్టు, విష్ణుమూర్తికి రావిచెట్టు, పరమశివుడికి మారేడుచెట్టు ప్రీతికరమైనవి.

అగ్నిని గర్భంలో దాచుకుంది రావిచెట్టు. ప్రళయకాలంలో దేవదేవుణ్ణి శిశువుగా చేసి తన ఆకును శయ్యగా మార్చింది మర్రిచెట్టు. అమ్మవారికి ప్రీతికరమైంది కదంబవృక్షం. ఈ నేపథ్యంలో- ‘మూడురేకుల మారేడుతో మురిసేడు శివుడు / అశ్వత్థమంటే ఆదివిష్ణు స్వరూపం / జన్మాంతర పాపాలను తొలగించు జమ్మి / మూడు మూర్తుల దత్తునికి ప్రియమైంది మేడి / ఉసురు పోస్తుంది ఉసిరి / శనికి ప్రీతికరం శమీ / వేప అమ్మవారికి ప్రియం.. అదే మహాలక్ష్మి స్వరూపం’ అంటూ వర్ణించాడు కవి. చెట్లతో మన అనుబంధం, ఆధ్యాత్మికత అందులో ప్రతిఫలిస్తాయి. మనకు వలెనే తరువులకూ ఆనందం, బాధ, ఆహ్లాదం లాంటివుంటాయని వేదాలు పేర్కొన్నాయి. ఆ విషయాన్ని జగదీష్‌ చంద్రబోస్‌ నిరూపించి చూపాడు. దైవ స్వరూపాలుగా పేర్కొనే వృక్షాల్లో అనేక అద్భుత శక్తులు దాగి ఉన్నాయంటే అతిశయం కాదు. చెట్లు మనకు సర్వదా తోడ్పతాయనే సంగతి అలా ఉంచితే.. పురాణేతిహాసాల్లో కొన్ని వృక్షాల ప్రత్యేకత ప్రస్తావనకు వస్తుంది..

దైవీశక్తుల రావి
పౌరాణిక కథలను అనుసరించి దేవతా వృక్షాల్లో రావిచెట్టు (అశ్వత్థం) విష్ణుమూర్తి స్వరూపం. దేవదానవ యుద్ధ సమయంలో విష్ణువు రావిచెట్టుగా మారి.. ‘అశ్వత్థ నారాయణుడు’ అయ్యాడు. యజ్ఞాలు, హోమాల్లో అగ్నిని సృష్టించే పద్ధతిని ‘అరణి మథనం’ అంటారు. ఇందులో జమ్మిచెట్టు కర్రను కిందిభాగంలోనూ, రావి కర్రను పైభాగంలోనూ ఉంచి మథించడం ద్వారా అగ్నిని పుట్టిస్తారు. ఆలయాల్లో దైవంతోపాటు రావిచెట్టునూ పూజించి తరిస్తారు. ఇందులోని ఔషధ గుణాలు వివిధ అనారోగ్యాలకు పరిష్కారం చూపుతాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందువల్ల నిస్సంతులు ఈ చెట్టుకు ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. గౌతముడికి జ్ఞానోదయమైంది ఈ బోధివృక్షం కిందే.

మర్రిచెట్టు నీడలో మహేశ్వరుడు
మహా ప్రళయం తర్వాత విష్ణుమూర్తి మర్రి ఆకుపై శిశువు రూపంలో శయనించాడన్నది పురాణ కథనం. అందుకే ఆ స్వామిని ‘వటపత్రశాయి’ అంటారు. జ్ఞానస్వరూపుడైన మహేశ్వరుడు మర్రిచెట్టు నీడలో నివసిస్తాడు. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఈ చెట్టును పూజిస్తారు. జ్యేష్ఠపౌర్ణమి నాడు వటసావిత్రీ వ్రతం ఆచరిస్తారు. రుషులు ధ్యానం చేయడానికి, విశ్రాంతి పొందడానికి అనువైన ప్రదేశంగా ఎంచుకుంటారు.

ఉసిరి.. విష్ణు రూపం
అమలకం, ఆమ్ల పేర్లతోనూ ప్రసిద్ధమైన ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉసిరిచెట్టు విష్ణుమూర్తి స్వరూపమనే నమ్మకంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తిక మాసంలో ఈ చెట్టు కింద వన భోజనాలు చేయడం శ్రేష్ఠమని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఉసిరి కాయలను దీపాలుగా వెలిగించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. ఇది ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, పర్యావరణ స్వచ్ఛతకు తోడ్పడుతుంది.

కదంబవృక్షానికి- కృష్ణవృక్షం, పార్వతీవృక్షం అనే పేర్లున్నాయి. అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. రాధాకృష్ణుల ప్రణయ లీలలు సాగింది ఈ చెట్టు నీడనే. ఇవే కాకుండా అశోక, మామిడి, కొబ్బరి, అరటి మొదలైన అనేక వృక్షాలు వనదేవతలుగా పూజలందుకుంటూ మానవాళి మనుగడకు సహకరిస్తున్నాయి.

పరమశివుడికి, లక్ష్మీదేవికి ప్రీతికరం బిల్వ. మూడు దళాలున్న బిల్వపత్రాలను ఈశ్వరుడి మూడు కళ్లకు ప్రతీకగా భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలూ అధికం. ఇక త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుడు మేడిచెట్టు నీడన ఉంటాడట. అందుకే అది పవిత్రమైనది. వేపచెట్టు లక్ష్మీదేవి స్వరూపమని చెబుతారు. అందుకే విష్ణుస్వరూపమైన రావిచెట్టును, లక్ష్మీరూపమైన వేపచెట్టును ఒకచోట నాటడం, వాటికి వివాహం చేయడం ఆచారంగా ఉంది. ఇలా చేయడంలో ఆంతర్యం ఆరోగ్య భావనే. శిరిడీ సాయిబాబా వేపచెట్టు నీడలో భక్తులకు జీవన సత్యాలను బోధించేవారని సాయి కథనాలు తెలియజేస్తున్నాయి. వేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చెట్టులో ప్రతి భాగం ఆరోగ్య కారకమే.

విజయాలు చేకూర్చే జమ్మి
అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను శమీవృక్షం కొమ్మల్లోనే దాచారు. రాముడు లంకపై యుద్ధానికి బయల్దేరేముందు ఈ వృక్షాన్ని పూజించాడు, విజయం పొందాడు. భృగుమమర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి అగ్నిదేవుడు ఈ చెట్టులో దాక్కున్నాడనే కథ బహుళ ప్రచారంలో ఉంది. అందుకే యజ్ఞయాగాల్లో అగ్నిని ఉత్పత్తి చేసేందుకు ఈ కలపను ఉపయోగిస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తోంది.

‘మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణీ / అగ్రతః శివ రూపాయ, వృక్ష రాజాయతే నమః’ అని, ‘శమీ శమయతే పాపం / శమీ శత్రు వినాశిని /అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని / అశోకామమృతాం దీప్తాం, లోకశోక వినాశనీ’ అని- మహర్షులు పేర్కొన్నారు. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ‘తెప్పగా మర్రాకు మీద తేలేటివాడు / ఎప్పుడూ లోకములెల్ల ఏలేటివాడు’ అని కీర్తించారు. ‘ఏక బిల్వం శివార్పణం’ అంటూ ఈశ్వరుని, ‘నమామి సతతం దత్త మౌదుంబర.. నిజానంద ప్రబోధం’ అని దత్తాత్రేయుని ఆరాధిస్తాం.

వృక్షానికి తరువు, మాను, వనస్పతి, ఓషధి, క్షితిజం, మహీజం, శాఖి, శాలం, శిఖరి, స్థిరం, గుల్మం.. అంటూ అసంఖ్యాకమైన పర్యాయ పదాలున్నాయి. ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్టత ఉంది. అవి ఆదరిస్తాయి, అక్కున చేర్చుకుంటాయి, ప్రత్యక్షదైవాలై జ్ఞానసిద్ధి కలిగిస్తాయి. జీవన పరమార్థాన్ని తెలియజేసి.. జన్మను సార్థకం చేసుకోమని ప్రబోధిస్తాయి.