
ఇప్పటి వరకు హిందూ దేవాలయాలు అంటే మొదట గుర్తుకు వచ్చేది భారతదేశం. అలాంటిది వియత్నాం దేశంలో ఉన్న హిందూ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది. వాస్తవానికి ఇప్పటికీ వియత్నాంలో భారీ హిందూ దేవాలయాల అవశేషాలు ఉన్నాయి. ఈ దేశంలో శివుడు, విష్ణువు, గణేషుడు, బ్రహ్మ విగ్రహాల అవశేషాలు కనిపిస్తాయి. ఈ దేశంలో హిందూ విస్తారమైన ప్రాంగణాల్లో విస్తరించి ఉన్న దేవాలయాల శిథిలాలు కనిపిస్తు్న్నాయి. ఈ దేశంలోని హిందూ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది.
మై సన్ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు..
ఈ దేశాన్ని ఒకప్పుడు హిందూ రాజులు పరిపాలించారు. ఆ సమయంలో ఈ రాజులు అక్కడ దేవాలయాలను నిర్మించారు. పర్వతాల మధ్య ఉన్న ఒక భారీ ఆలయ సముదాయం అవశేషాలను ఇప్పుడు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీనికి మై సన్ అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు దీని నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంది. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించని అరుదైన శివలింగం అని పర్యాటకులు చెబుతున్నారు.
వియత్నాం చరిత్ర ప్రకారం.. దేశాన్ని హిందూ రాజులు 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని చంపా సామ్రాజ్యం అని పిలిచేవారు. అప్పుడు ఇక్కడ హిందూ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఈ చంపా సామ్రాజ్యంలో శివుడిని విశేషంగా పూజించేవారు. నిజానికి హిందూ రాజులు పర్వతాలు, నది చుట్టూ ఈ చంపా రాజ్యాన్ని స్థాపించారు. వారు ఈ మైసన్ ప్రదేశాన్ని వారి తమ మతపరమైన, రాజకీయ రాజధానిగా చేసుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రాజ్యాన్ని క్రీ.శ. 192లో చంపా రాజు భద్రవర్మన్ స్థాపించారు. చంపా రాజులు భారతీయ సంస్కృతిచే బాగా ప్రభావితమయ్యారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రాజులు తమను తాము భద్రవర్మన్, హరివర్మన్, విక్రమవర్మన్ వంటి సంస్కృత పేర్లతో పిలుచుకున్నారు. వీళ్ల రాజ్యంలో అధికారిక భాషగా సంస్కృతం ఉండేది. వారు భారతీయ దేవతలను, ముఖ్యంగా శివుడు, విష్ణువు, కృష్ణుడిని అధికారిక మతంగా అభివర్ణించి ఆరాధించారు. మై సన్‌లోని చాలా ఆలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయాలను భద్రేశ్వర అని పిలుస్తారు. దీని అర్థం “రాజు దేవుడు” అని చెబుతారు. వియత్నంలో నిర్మిణించిన ఈ ఆలయాలు అన్ని కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారత శైవ దేవాలయాల నిర్మాణం నుంచి ప్రేరణ పొంది నిర్మించినట్లు కనిపిస్తున్నాయి. దేవాలయాలలో కనిపించే శివలింగం, నంది, త్రిమూర్తి శిల్పాలు పది శతాబ్దాల క్రితం వియత్నాంలో హిందూ మతం, దాని మతపరమైన ఆచారాలు ఉన్నాయని సూచిస్తున్నాయి.
మైసన్ ఆలయ ప్రత్యేకతలు..
పర్వతాల మధ్య ఉన్న ఈ మైసన్ శివాలయాలు.. తూర్పు వైపు తెరిచి ఉన్న ఆలయ ద్వారాల ద్వారా ఉదయం మొదటి సూర్య కిరణాలు శివలింగంపై పడే విధంగా నిర్మించబడ్డాయి. ఈ ఆలయం మేరు పర్వతం ఆకారంలో కనిపిస్తున్నాయి. ఈ దేవాలయాల ఆకారం భారతీయ పర్వత మేరును పోలి ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దేవాలయాలు ఎర్ర ఇటుకలతో నిర్మించారని, ఈ శిఖర ఆకారపు దేవాలయాలు విష్ణువు అవతారాలు, అప్సరసలు, యుద్ధ దృశ్యాలతో సహా హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొంది నిర్మించినట్లు కనిపిస్తున్నాయి. మైసన్ దేవాలయాల వద్ద జరిపిన తవ్వకాలలో బయటపడిన అనేక సంస్కృత శాసనాలు చంపా రాజులు సంస్కృతాన్ని మతపరమైన, పరిపాలనా భాషగా స్వీకరించారని సూచిస్తున్నాయి. ఈ శాసనాలు హిందూ ఆరాధన ఆచారాలు, రాజుల దాతృత్వం “మహేశ్వర,” “నారాయణ,” “లక్ష్మి” వంటి దేవతల పేర్లను ప్రస్తావించాయి.
సహాయం చేసిన భారత్..
మైసన్ ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, వియత్నాం గడ్డపై భారతదేశం – వియత్నాం సాంస్కృతిక కలయికకు నిదర్శనం. ఇండియా- వియత్నాం మధ్య శతాబ్దాల నాటి సంబంధాన్ని ఈ దేవాలయం వెల్లడిస్తుంది. భారతదేశ రాజులు ఇక్కడ తమ సామ్రాజ్యాలను స్థాపించి, ఇండియాతో నిరంతర వాణిజ్యం జరిపించే వారు. అలాగే చంపా సామ్రాజ్యంలో భారతీయ హిందూ ఆలోచన, నిర్మాణ సంప్రదాయాలు, చేతి పనులను ప్రోత్సహించే వారు. ఈ స్థలాన్ని సంరక్షించడంలో భారతదేశం వియత్నాంకు సహాయం చేసిందని ఈ వారసత్వ ప్రదేశంలో ప్రదర్శించిన శిలాఫలకాల ద్వారా రుజువు అవుతుంది.
వియత్నాంలో ఈ ప్రదేశం ఎక్కడ ఉంది..
వియత్నాం మైసన్ హెరిటేజ్ సైట్ క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లోని డుయోయ్ ఫు కమ్యూనల్, డుయోయ్ సుయెన్ జిల్లాలో ఉంది. ఈ ఆలయాలు ఒక విశాలమైన ప్రాంగణంలో ఉన్నాయి. వీటిని 1999లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. పర్వతాలు, అడవులతో అందమైన లోయలో ఉన్న ఈ ప్రదేశానికి ప్రయాణం నిజంగా ఆకర్షణీయంగా ఉంటుందని పర్యాటకులు చెబుతున్నారు. ఈ లోయ సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పుతో, రెండు పర్వత శ్రేణుల మధ్య ఉంది. ఈ పర్వతాల మధ్య థు బోన్ నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక నగరం డా నాంగ్ నుంచి దాదాపు 68-70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక యుద్ధాలలో ఈ ప్రదేశం తీవ్రంగా నష్టపోయింది. వియత్నాం యుద్ధం (1955–1975) సమయంలో అమెరికన్ బాంబు దాడి ముఖ్యంగా ఆలయ సముదాయంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేశాయి. భారత పురావస్తు సర్వే అనేక ఆలయ సముదాయాల పరిరక్షణను పూర్తి చేసింది. వాటి పునర్నిర్మాణం, పరిరక్షణ, నిర్వహణ కోసం భారతదేశం US$4.8 మిలియన్లకు పైగా ఆర్థిక సహాయం అందించింది.





