
ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్‌లో చోటు లేదని ప్రధాని మోదీ అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. వారి ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100కి పైగా జిల్లాలు ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటాయని పేర్కొన్నారు.గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధాని దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతా దళాల స్థైర్యాన్ని ప్రశంసించారు.
‘‘మావోయిస్టులు.. అభివృద్ధి నిరోధకులుగా మారారు. వారి ఏరివేతకే ఆపరేషన్ కగార్ చేపట్టాం. భద్రతా దళాల ధైర్యం కారణంగానే దేశం మరో ప్రధాన మైలురాయిని సాధించింది. 11 ఏళ్లక్రితం నక్సల్స్ 125 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమయ్యారు. మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడమే మా లక్ష్యం. 100కు పైగా జిల్లాల ప్రజలు మావోయిస్టుల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారు. వేల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు’’ అని మోదీ తెలిపారు.
‘‘గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిని తీసుకువచ్చారు. పాఠశాలలు, ఆసుపత్రులను పేల్చివేసి, వైద్యులను కాల్చి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కొత్త పాఠశాలలు, ఆస్పత్రులతో చిన్నారులు నూతన భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఈ విజయం మొత్తం భద్రతా దళాలదే. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజలు తొలిసారిగా దీపావళిని గర్వంగా, గౌరవంగా నిర్వహించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా’’ అని మోదీ పేర్కొన్నారు.
మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలసిందే. ఇందులో భాగంగా దండకారణ్యాల్లో జరిపిన ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకుల నుంచి అనేక మంది మావోయిస్టులు మరణించారు. ఈ పరిణామాలతో చాలా మంది ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరుతున్నారు.