
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పామ్ బే కౌన్సిల్ సభ్యుడు షాండ్లర్ లాంజివిన్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే పామ్ బే కౌన్సిల్ ఆయనపై చర్యలు చేపట్టింది.
ఓ భారతీయ ట్రక్ డ్రైవరు కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందనే వార్తను లాంజివిన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ క్రమంలో భారత దేశానికి చెందిన ఏ ఒక్క వ్యక్తీ అమెరికా గురించి పట్టించుకోరని ఆరోపించారు. భారతీయులు అమెరికాను దోచుకోవడానికే వస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్‌ను ఉద్దేశించి… తన పుట్టిన రోజు బహుమతిగా భారతీయుల వీసాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండు చేశారు. ‘ఎవరైనా భారతీయులను నియమించుకుంటే వారు సంపాదించే డబ్బులను వారి దేశానికే పంపుతారు. భారత్‌లోని ఎన్నికల్లో ఖర్చు చేస్తారు. అక్కడ గెలిచిన వారు అమెరికా ప్రభుత్వ కార్యాలయాలపై భారతీయ జెండాలను ఎగురవేసేందుకు లాబీయింగ్ చేస్తారు. మన సైన్యానికి సేవ చేసేందుకు ఏ ఒక్క భారతీయ కుటుంబమూ ఇష్టపడదు. వారి లాయల్టీ అంతా భారత్‌పట్లే ఉంటుంది. అందుకే వారిని భారత్‌కు తిప్పి పంపాల్సిన అవసరముంది’ అని షాండ్లర్ పేర్కొన్నారు.
షాండ్లర్ వ్యాఖ్యలపై ప్రవాస భారతీయులు మండిపడ్డారు. ఆయనను కౌన్సిల్ నుంచి తొలగించాలని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్‌కు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూపు విజ్ఞప్తి చేసింది. తీవ్రంగా విమర్శలు రావడంతో లాంజివిన్ కాస్త దిగొచ్చారు. అమెరికా పౌరులుగా ఉన్న భారతీయుల దేశభక్తిని తాను శంకించలేదని, అక్రమంగా ఉంటున్న వారి గురించే మాట్లాడానని అభిప్రాయపడ్డారు.