
అయోధ్య నగరం దీపావళి పర్వదినం సందర్భంగా చరిత్ర సృష్టించింది. తొమ్మిదో దీపోత్సవం సందర్భంగా 56 ఘాట్ లలో 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. దీంతో సరయూ నదీ తీరం మొత్తం దీపాలతో నిండిపోయి, అందర్నీ ఆకర్షించింది.
56 ఘాట్‌లలో ఏకంగా 26 లక్ష 11 వేల 101 దీపాలను వెలిగించారు. 2 వేల వంద మందితో సరయూ నదీ తీరాన మహా హారతి నిర్వహించారు. అయోధ్య నగరం ఈసారి కేవలం ఒక దీపావళి పండుగను కాకుండా, ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూసింది. 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టారు.
బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు ఏడు కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానర సేన ఊరేగింపు నిర్వహించారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మణిపుర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్‌లీలా, జానపద నృత్యాలను ప్రదర్శించారు. ఇక 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణసంచా వేడుకలు హైలెట్‌గా నిలిచాయి.
అయోధ్యకు రాముడు తిరిగి వచ్చినప్పటి సంబరాలను గుర్తుచేసుకుంటూ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ వేషధారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి ఇచ్చారు. సంప్రదాయకంగా పుష్పక విమాన్ రథాన్ని లాగారు. ఈ సందర్భంగా 2,1000 మంది కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ప్రత్యేక రామ్‌లీలా ప్రదర్శనకు ఐదు దేశాల నుంచి కళాకారులు విచ్చేశారు. ఈ ఉత్సవాలు రాత్రంతా ఎంతో కోలాహలంగా సాగనున్నాయి.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవథ్ యూనివర్శిటీ సారథ్యంలో వేలాదిమంది వలంటీర్లు సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్ల వెంబడి దీపాలను ఏర్పాటు చేశారు. ఏకకాలంలో దీపాలు వెలిగించేందుకు 33,000 మంది వలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. 56 ఘాట్లకు దీపాలను పంపిణీ చేసినట్టు దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా తెలిపారు. భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలు, అంకితభావానికి దీపోత్సవ్ సంకేతమని, అయోధ్య వారసత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రతి వలంటీర్‌కు గర్వకారణమని యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ బిజేంద్ర సింగ్ తెలిపారు.