
వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదని నిరూపించిన కవి వాల్మీకి అని కొనియాడారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు.
తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొని నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. మనిషిలో మార్పు అనేది ఎప్పుడైనా రావచ్చని దానికి నిదర్శనం వాల్మీకి అని అన్నారు. వేటగాడుగా ఉన్న వ్యక్తి మహర్షిగా అనంతరం ఆదికవిగా మారి మహత్తరమైన రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించారన్నారు. కుటుంబ విలువలు, సోదర భావాల గురించి ఎంతో గొప్పగా వివరించిన కావ్యం రామాయణం అన్నారు. ఇటువంటి వ్యక్తులు జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. పుణ్యభూమి, కర్మభూమి మన భారతదేశమని, రామాయణం మన పూజ్య గ్రంథమన్నారు. అంతటి గొప్ప గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి అన్నారు.