
ఆయుర్వేదానికి పునర్ వైభవం తెచ్చేందుకు శ్రమిస్తున్న భారతీయ శాస్త్రవేత్త ఆచార్య బాలకృష్ణకు అపురూప గౌరవం దక్కింది. పతంజలి సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగంలో పని చేస్తున్న ఆచార్య -బాలకృష్ణకు ప్రపంచ అత్యున్నత రెండు శాతం శాస్త్రవేత్తలలో స్థానం దక్కింది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఎల్సెవీర్ కలసి ఈ జాబితా తయారు చేశారు.
పురాతన భారతీయ విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానం, ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆచరణలతో మేళవించినప్పుడు ఎలాంటి విజయాలు సాధించవచ్చునో ఈ పురస్కారం ద్వారా వెల్లడైంది. ఆధునిక పరిశోధనకీ, ఆయుర్వేదంలోని జ్ఞానం లేదా వివేకానికి నడుమ ఉన్న దూరాన్ని పోగొట్టి, అనుసంధానించడానికి ఆచార్య బాలకృష్ణ చిరకాలంగా విశేష కృషి చేస్తున్నారు. ప్రకృతిలో లభించే మూలికలను శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చునని, ఆ అధ్యయనం ప్రపంచానికి ఉపయోగపడే విధంగా అక్షరబద్ధం చేయవచ్చునని ఆయన పరిశోధనా దృక్పథం రుజువు చేసింది. ఆయన మార్గదర్శకత్వంలోని పరిశోధక బృందం ఇంతవరకు 300 వరకు పరిశోధక పత్రాలను రూపొందించింది.
అవన్నీ ఆయుర్వేద అధ్యయనం విస్తృతిని వెల్లడించడమే కాకుండా, మూలికా వైద్యాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే ప్రక్రియను పటిష్టం చేశాయి. ఆయన పనిచేస్తున్న పతంజలి సంస్థ 100 వరకు ఆయుర్వేద ఔషధాలను వృద్ధి చేసింది. ఈ పనంతా శాస్త్రబద్ధమైన పునాది ఆధారంగా జరిగింది. అలాగే ఈ ఔషధాలన్నీ సురక్షితమైనవి, సహజసిద్ధమైనవి, అలాగే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవే కూడా. నిజానికి అల్లోపతి వైద్య విధానానికి ప్రత్యామ్నాయంగా పనిచేసేవే. దీనితో లక్షలాది ప్రజలకు ఆరోగ్య రక్షణ అందుబాటులోకి వచ్చింది. ఆచార్య బాలకృష్ణ తాను సంపాదించిన జ్ఞానాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకోలేదు. ప్రయోగశాలకు బయట కూడా ఆయన ఎంతో సేవ చేశారు.
యోగాభ్యాసం, ఆయుర్వేదాల గురించి ఆయన రచించిన 120 పుస్తకాలు ఆ సేవ ఫలితమే. ఇవన్నీ సరళమైన భాషలో రాశారు. దీనితో విజ్ఞాన శాస్త్రం అభ్యసించే విద్యార్థులకే కాక, సాధారణ వ్యక్తులకు వైద్యం మీద అవగాహన ఏర్పడడానికి అవకాశం వచ్చింది. ఆయుర్వేదం గురించి భారతదేశంలో ఎన్నో పురాతన గ్రంథాలు లభిస్తాయి. అలాంటి అత్యున్నత 25 గ్రంథాలను ఆచార్య బాలకృష్ణ పరిష్కరించారు. అలా అలనాటి ఆ విజ్ఞానానికి మళ్లీ వెలుగునిచ్చారు. మూలికా విజ్ఞాన సర్వస్వం రచన ఆయన చేసిన అద్భుత, ఉత్తమ సేవగా పరిగణిస్తారు. ప్రకృతి ప్రసాదించిన అనేక మూలికల వివరాలు ఇందులో ఆయన పొందుపరిచి, శాస్త్రవేత్తలకు ఎంతో మేలు చేశారు. పరిశోధనకు ఇదొక మూల వనరుగా నిలిచింది. దీనికి ప్రపంచ ఖ్యాతి కూడా దక్కింది.
ఆచార్య బాలకృష్ణ భారతదేశానికే పరిమితమయ్యారు. ఉత్తరాఖండ్లోని మాలేగావ్ లోని హెర్బల్ వరల్డ్ మాత్రమే ఆయన ప్రపంచం. అయితే ఆయన ప్రకృతి వైద్యాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేశారు. పతంజలి సంస్థకే చెందిన బాబా రామ్ దేవ్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ వర్షణి బాలకృష్ణకు ప్రత్యేక పురస్కారం పట్ల హర్షం వ్యక్తం చేశారు.