ArticlesNews

మీరా భజనల సృష్టికర్త భక్త మీరాబాయి

39views

( ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ – మీరాబాయి జయంతి )

‘హరీ మైతో ప్రేమ్‌ దినానీ..’ అని పాడుకునేది మీరా. లోకంలో ప్రతి ప్రేమకూ ఓ పరిమితి ఉంటుంది కానీ ఆ పరమాత్మ ప్రేమకు మేర లేదనేది మీరా. భగవంతుణ్ణి అంతరంగంలో ఆసీనుణ్ణి చేసుకున్న ఆమె, మహారాణి స్థానాన్ని కూడా తృణప్రాయంగా తోసిపుచ్చింది. ఎవరిని ప్రేమిస్తే.. మరెవరినీ ప్రేమించాల్సిన అవసరం లేదో, ఎవరి ప్రేమను పొందితే ఇంకెవరి ప్రేమనూ పొందాల్సిన పనిలేదో ఆయనే పరమాత్మ అని నిరూపించింది. ప్రాపంచిక ప్రేమ కన్నా పారలౌకిక ప్రేమలోని శాశ్వతత్వాన్ని లోకానికి చాటింది. ఓ గీతంలో ‘బినా ప్రేమ్‌ నహీ మిలే నందలాలా’ అంటూ ప్రేమతోనే ఆ గిరిధరుడు మన సొంతమవుతాడని ప్రకటించింది. మేరే నయనమే బసో నందలాలా.. నా కళ్లలోనే ఉండి పోమంటూ ప్రార్థించింది. నల్లనయ్యకు ఆంతరంగిక భక్తురాలై, అశేష ఆస్తిక జనావళికి ఆదర్శమూర్తిగా నిలిచిన మీరాబాయి జయంతి ఈ అక్టోబరు 7న జరుపుకుంటున్నాము.

15వ శతాబ్దానికి చెందిన మీరా రాజస్థాన్‌లో ఓ రాజకుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు మిహిరాబాయి. సూర్యముఖి అని ఆ పేరుకు అర్థం. చిన్న తనంలోనే కన్నవారు దూరమయ్యారు. తాతయ్య రావ్‌ దూదాజీ వద్ద పెరిగిన మిహిరా ఏకసంథాగ్రాహి. ఆయన నుంచే సంగీత సాహిత్య అభిరుచుల్ని అలవరచుకుంది. బాలికగా ఉన్నప్పుడే ఆమె మనోక్షేత్రంలో భక్తిబీజాలు అంకురించాయి. అందుకే ఇతర రాజకుటుంబాల్లోని బాలికల్లా రాజసికంగా కాకుండా సాత్త్వికంగా ఎదిగింది. మిహిరా.. మీరాగా మారింది.

యుక్తవయసు రాగానే కుమార భోజరాజుతో మీరాకి పెళ్లిచేశారు. భగవంతుణ్ణి భర్తగా భావించినా మీరా ఎన్నడూ కుటుంబ బాధ్యతల్ని విస్మరించలేదు. దాంపత్య జీవితాన్ని గడపక పోయినా అర్ధాంగిగా అణకువతోనే నడచుకునేది. గృహణి ధర్మాణ్ని పాటిస్తూ భర్త, అత్తమామలకు సపర్యలు చేసేది. పనులన్నీ పూర్తయ్యాక మందిరంలోకి వెళ్లి కృష్ణ ధ్యానంలో, ఆయన నామ గానంలో లీనమైపోయేది. శ్రీమంతురాలైనా మీరా సామాన్య స్త్రీగానే జీవనాన్ని కొనసాగించింది. సఖులు, సేవకులను ఆదరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేది. దానధర్మాలతో దయామయిగా పేరుతెచ్చుకుంది. వివాహమైన కొన్నాళ్లకే వైధవ్యం ప్రాప్తించింది. అది కూడా వేణుగోపాలుడి లీలగానే భావించి, ఆపై పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో మునిగి పోయింది.

మీరా తన భజనల్లో శరణాగతికి, ఆత్మనివేదనకు ఎంతో ప్రాధాన్యాన్నిచ్చింది. ఆమె భాష సరళం, సంగీతాత్మకం. ఆమె పదాల్లో భక్తి, శాంతరసాలు పొంగి పొరలుతాయి. రాజస్థానీ, గుజరాతీ, వ్రజ, హిందీ భాషల్లో దాదాపు 2500 వరకు రచించిన ఆమె గీతాలన్నీ సంగీత సాహిత్యాల కలబోత. మధురభక్తి, కృష్ణప్రేమల కలనేత. ఆ భజనలన్నీ ‘గిరిధర గోపాల..’ అనే మకుటంతో ముగుస్తాయి. ఆనాటి ఛాందస భావాలను ధిక్కరించిన ధీశాలి మీరా. పరపురుషులను కన్నెత్తయినా చూడకూడదని.. స్త్రీలను తెరల చాటున ఉంచే రోజుల్లో ఆమె ధైర్యంగా ఆధ్యాత్మిక గురువుల వద్దకు వెళ్లి తన సంశయాలను నివృత్తి చేసుకునేది. వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది. తులసీదాస్, రవిదాస్, జీవగోస్వామి వంటి సాధకులతో నిర్మొహమాటంగా శాస్త్ర చర్చలు జరిపేది. భక్తి పారవశ్యంలో నృత్యం చేసేది.

శ్రీకృష్ణుడి లీలాక్షేత్రాలైన ద్వారక, బృందావన ప్రాంతాల్ని ఒంటరిగా సందర్శించింది మీరాబాయి. తన జీవన సంధ్యా సమయంలో రాధారమణుడి ధ్యానంలోనే గడిపి, అక్కడే ద్వారక క్షేత్రంలోనే తుదిశ్వాస విడిచి దామోదరుడిలో ఐక్యమైపోయింది. సిక్కు మతస్థులు కూడా మీరాబాయికి సమున్నత స్థానాన్ని కల్పించారు. తమ చారిత్రాత్మక భక్తి సాధువుల్లో ఆమెని ఒకరిగా గుర్తించారు. మీరాను తమ పారమార్థిక గురువుగా భావిస్తారు.