News

మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత

38views

ఓ ఆలోచన ఆధ్యాత్మికత, స్వచ్ఛతను మేళవించింది.. ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ సంస్థకు పునాది పడింది.. ఆలయాల్లో స్వచ్ఛతను సాక్షాత్కరించేందుకు అడుగులు పడ్డాయి.. వంద మందితో ప్రారంభమైన స్వచ్ఛ అడుగులు నేడు రెండు వేల మంది జతకట్టారు. ఇప్పటి వరకు 260 ఆలయాలు, కోనేర్లను శుభ్రం చేశారు. వీరి సేవలను ‘స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ 2025’ గుర్తించింది. ఎన్జీవో విభాగంలో స్వచ్ఛత పురస్కారానికి ఎంపిక చేశారు.

నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి ప్రాంతాలకు చెందిన కొందరు భక్తులు ఎంవీ శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జట్టుకట్టారు. ఆలయాల్లోని అపరిశుభ్రత, అసౌకర్యాలను దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ బృహత్‌ కార్యక్రమాన్ని నంద్యాలలోని ప్రథమ నంది ఆలయంలో 2022 మే 12న ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు ఆలయాలతోపాటు తిరుపతి, అరుణాచలం, వారణాసి తదితర పుణ్యక్షేత్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 260కిపైగా ఆలయాలు వాటితో అనుసంధానంగా ఉన్న కోనేర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘‘ ఆలయాల్లో ఉన్నప్పుడు కలిగే అనుభూతి ఎంతో గొప్పది.. సామాన్యులూ స్వామి సేవలో తరించొచ్చు.. అలా చేయడంతో ఎంతో పుణ్యకార్యమంటూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ప్రభావితం చేశాయి.. ఇదే విషయాన్ని స్నేహితులతో పంచుకొన్నా.. అందరి భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని’’ శివకుమార్‌రెడ్డి అన్నారు.