News

పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన

10views

మానవ హక్కుల ఉల్లంఘనలో పాకిస్థాన్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌ హెచ్‌ఆర్‌సీ) 60వ సెషన్‌ 34వ సమావేశం వేదికగా మరోసారి బట్టబయలైంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యవహారాల పరిశోధకుడు జోష్‌ బోవెస్‌ కీలక వివరాలను వెల్లడించారు. బలోచిస్తాన్‌ ప్రాంత ప్రజల మానవ హక్కులను హరించేలా పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం దారుణంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాక్‌లో మానవ హక్కుల స్థితిగతులపై మరింత మెరుగ్గా పర్యవేక్షణ చేయాలని యూఎన్‌ హెచ్‌ఆర్‌సీని జోష్‌ బోవెస్‌ కోరారు. పాకిస్థాన్‌కు ఇచ్చిన జీఎస్‌పీ స్టేటస్‌ను సమీక్షించే క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌ గుర్తించిన ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మానవహక్కుల అమలుకు పాక్‌ కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన డిమాండ్‌ చేశారు.

పాక్‌ నిజస్వరూపాన్ని చూపించే గణాంకాలు ఇవే!
‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలోనూ పాకిస్థాన్‌ అత్యంత తక్కువగా 158వ స్థానంలో ఉంది. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు దైవదూషణ అభియోగాలతో 700 మందికిపైగా వ్యక్తులను పాక్‌ సర్కారు జైళ్లలో పెట్టిందని ‘యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ మతస్వేచ్ఛ నివేదిక – 2025’లో ప్రస్తావించారు. 2024తో పోలిస్తే ఈ ఏడాది పాక్‌లో ఈ విధమైన కేసులు 300 శాతం పెరిగాయి. 2025 సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలో బలూచిస్థాన్‌లో పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకున్న 785 మంది ఆచూకీ గల్లంతైందని బలూచ్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌కు చెందిన మానవ హక్కుల విభాగం పాంక్‌ తెలిపింది. 121 మంది బలూచ్‌వాసులను పాక్‌ ఆర్మీ చంపిందని నివేదికలో పొందుపరిచారు. పాక్‌ సైన్యం కారణంగా 2025లో దాదాపు 4వేల మంది పస్తూన్‌ తెగ ప్రజల ఆచూకీ గల్లంతైందని పష్టూన్‌ నేషనల్‌ జిర్గా వెల్లడించింది’ అని జోష్‌ బోవెస్‌ వివరించారు.

జీఎస్‌పీ+ అంటే ఏమిటి ?
మానవ హక్కులతో ముడిపడిన చట్టాలను పక్కాగా అమలుచేసే దేశాలతో వాణిజ్యానికి యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రాధాన్యత వేస్తోంది. ఇందుకోసం జనరలైజ్డ్‌ స్కీమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌(జీఎస్‌పీ)ను అనుసరిస్తోంది. ఈ ప్రమాణాలను పాటించే దేశాలకు జీఎస్‌పీ+(ప్లస్‌) హోదా ఇస్తోంది. ఈ హోదా కలిగిన దేశాల నుంచి వచ్చే 66 శాతం సరకులపై ఎలాంటి సుంకాన్ని ఈయూ విధించడం లేదు.