News

‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం.. యోగి బుల్డోజర్ యాక్షన్

10views

ఇటీవల ‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. బరేలీలో గత శుక్రవారం ప్రార్థనల తర్వాత గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఆ తర్వాత, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ అల్లర్లు కౌశాంబి, కాన్పూర్‌‌లతో పాటు గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి వివిధ ప్రదేశాలకు వ్యాప్తించాయి. అయితే, ఈ అల్లర్లకు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తేహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) అధ్యక్షుడు తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే, అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టారు. తౌకీర్ రజా ఖాన్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ఆస్తులపై చర్యలు ప్రారంభమయ్యాయి. బరేలీలోని అతడి అనుచరుల ఆస్తులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తౌకీర్ రజా సన్నిహితుడైన నదీమ్ ఖాన్ నివాసానికి బుల్డోజర్లు చేరుకున్నాయి. ఈ స్థలంలో పనులు నిలిపేసి, సీలు వేశారు. అతడి బంధువుల పేరుతో రిజిస్టర్ అయి ఉన్న ఒక ప్రాపర్టీని కూల్చివేస్తామని అధికారులు చెప్పారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మోహరించబడ్డాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో సహా సీనియర్ అధికారులు పనుల్ని సమీక్షిస్తున్నారు. ఫైక్ ఎన్‌క్లేవ్, జగత్‌పూర్, బరేలీ ఓల్డ్ సిటీలలో విస్తరించిన అక్రమ నిర్వాణాలను అధికారులు టార్గెట్ చేశారు. ఫైవ్ ఎన్‌క్లేవ్ నేరస్తులకు స్వర్గధామంగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ బావమరిది సద్దాకు చెందిన ప్రాపర్టీని అధికారులు సీల్ చేశారు. తౌకీర్ రాజా అనుచరులు ఫర్హాన్, మొహమ్మద్ ఆరిఫ్‌లు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.