
దాయదికి భారత్ మీద అక్కసు సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతునే ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యంతో ఎన్నికైన ప్రభుత్వం ఉండనీ, సైనిక పాలన కొనసాగనీ అక్కసు మాత్రం మారదు. తాజా విషయం ఏమిటంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పేరుకే ఉందనే నిజం పూర్తిగా బయటపడింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌పై తన రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాకరించారు. ఈ విషయం జెటియో వేదికపై బయటపడింది. ఇంతకన్న మంచి ఉదాహరణ పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి ఉండదు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌తో జెటియో వేదికపై జర్నలిస్ట్ మెహదీ హసన్ ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ సంభాషణ వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తుంది. “జనరల్ మునీర్‌ను మీరు తొలగించగలరా?” అని హసన్ నేరుగా అడిగినప్పుడు, ఆసిఫ్ సంకోచంతో స్పందించారు. ఏదైనా భిన్నాభిప్రాయాలు తలెత్తితే నిర్ణయం “ఏకాభిప్రాయం” ద్వారా తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సమాధానం పాకిస్థాన్‌లో సైన్యం నిజమైన శక్తి అని, పౌరులు పేరుకే ఉన్నారని స్పష్టం చేసిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మునీర్ ప్రశ్నతో ఇరుక్కుపోయిన ఆసిఫ్ ..
ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, వ్యూహం అని నిపుణులు అంటున్నారు. ఆసిఫ్ మునీర్‌ను తొలగించవచ్చని చెప్పి ఉంటే, సైన్యం ఘాటుగా స్పందించేది. “అవును” అని చెప్పడం వల్ల ప్రభుత్వ దుర్బల స్థితి ప్రమాదంలో పడింది. దీంతో ఇంటర్వ్యూలో ఆసిఫ్ తన రాజకీయ భద్రత, ప్రస్తుత ప్రభుత్వ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడని పేర్కొంటున్నారు. అదే సమయంలో రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య సూత్రాలను పూర్తిగా విస్మరించాడని చెబుతున్నారు.
‘సైన్యానికి బానిసైన పాక్ ప్రభుత్వం’
ఈ ఇంటర్వ్యూ పాకిస్థాన్ ప్రజాస్వామ్యం సైనిక నియంత్రణలో ఉందని స్పష్టంగా చూపిస్తుంది. పౌర ప్రభుత్వం కేవలం ఒక ముసుగు మాత్రమే. సైన్యం నిజమైన అధికారాన్ని, నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటుందని, పౌర అధికారులు కేవలం దాని బానిసలు మాత్రమే అనే వాదనను నిజం చేసింది. పాకిస్థాన్‌లోని ఈ ముసుగు ప్రజాస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వానికి, పొరుగు దేశాలకు ముప్పు కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య సూత్రాలు కాగితంపై మాత్రమే ఉన్నాయని ఖవాజా ఆసిఫ్ స్వయంగా నిరూపించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.