News

కాత్యాయని దేవిగా కనకదుర్గమ్మ

277views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు.

చంద్రహాసోజ్జ్వలకరా ! శార్దూలవరవాహనా !
కాత్యాయనీ ! శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ !!

శరన్నవరాత్రి మహోత్సవములలో శుద్ధచవితినాడు శ్రీ అమ్మవారు శ్రీకాత్యాయనీ దేవిగా దర్శనమిస్తారు.

పూర్వం’కత’అనే మహర్షికి దేవీఉపాసనవల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండే తండ్రి నుంచి భక్తిని అలవరచుకున్న ఆ తపస్వికే ‘కాత్యాయనుడు’ అని పేరు. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు అవ్వడంతో దేవినే పుత్రికగా పొందదలచి గొప్పతపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలైంది. మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయనీదేవి అని పిలవబడింది.

లోకకంటకులైన రాక్షసులను అంతమొందించుటకు ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కాత్యాయనీదేవికి తగు శక్తిని ప్రసాదించి లోకకళ్యాణం కావించారు. కాత్యాయనీదేవి భక్తులపాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగములు, శోకములు, భయాలు నశిస్తాయి. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు భక్తుల ఇంట వర్దిల్లుతాయి.