
పరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేసేందుకు వరసగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు పలు ఎన్‌కౌంటర్లలో కీలకమైన మావోయిస్టు లీడర్లను హతమార్చారు. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్‌కి కీలక విజయమని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ల నేపథ్యంలో మావోయిస్టులు ‘‘కాల్పుల విరమణ’’ను ప్రకటించారు. ఆయుధాలను వదిలేస్తామని కేంద్రానికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
అయితే, ఈ కాల్పుల విరమణ హామీ 24 గంటల్లోనే విఫలమైంది. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో ఇద్దరు పౌరుల్ని దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 16-17 తేదీల్లో అర్థరాత్రి ఈ సంఘటనలు జరిగాయి. శాంతి చర్చల కోసం ఆయుధాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన మావోయిస్టులు, ఒక రోజులోనే ఈ హత్యలకు పాల్పడ్డారు.
బీజాపూర్ జిల్లాల్లోని భైరామ్‌గఢ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు బెంచరం పంచాయతీ ఉప సర్పంచ్ దష్రు రామ్ ఓయంపై దాడి చేసి చంపేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో ఇతడిని హత్య చేశారు. దంతేవాడ జిల్లాలో కూడా ఇలాంటి హత్యే జరిగింది. మలంగిర్ ఏరియా కమిటీ సభ్యులు నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రామ్‌ను ఉరి తీసి చంపారు. ఇతడిని కూడా పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా భావించే హత్య చేశారు.
ఈ హత్యలపై పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బస్తర్ ఏరియాలో భద్రతా కార్యకలాపాలు తీవ్రతరం అవుతాయని సీనియర్ పోలీస్ అధికారులు మీడియాతో చెప్పారు. ఈ హత్యలు మావోయిస్టుల నిజాయితీ లేనితనాన్ని చూపిస్తున్నాయని అన్నారు. మార్చి, 2026 నాటికి మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారు.
కాల్పుల విరమణకు సంబంధించి మావోయిస్టు కేంద్ర నాయకత్వం లేఖను విడుదల చేసింది. శాంతి చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖ విడుదలైన 24 గంటల్లోనే హత్యలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.