News

నవరాత్రి స్పెషల్‌.. బొమ్మల కొలువులో సైనికుల బొమ్మలు

274views

దేవీ నవరాత్రులతో బొమ్మలకొలువూ మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడుల్లో ఈ బొమ్మల సంబరం ఎక్కువగా కనిపిస్తుంది.ఈ రోజుల్లో అమ్మవారిని పూజించడంతోబాటు దైవానికి ప్రతీకలుగా భావించే బొమ్మల్ని అందంగా అమరుస్తారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో కోయంబత్తూర్‌లో గోలు బొమ్మల సందడి మొదలైంది. వాటి అమ్మకాలు పెరిగాయి. అయితే ఈసారి తయారీదారులు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని.. త్రివిధ దళాల కమాండర్లు, సైనికుల ఆకృతి బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ ప్రత్యేకత స్థానిక ప్రజలను ఆకట్టుకుంటోంది. దాంతో ఈసారి బొమ్మల కొలువు కోసం వాటిని కొనుగోలు చేస్తున్నారు.

ప్రతిఏటా గోలు పూజ (బొమ్మల కొలువు) కోసం ఏటా కొత్తరకం ఆకృతుల్లో బొమ్మలు సిద్ధమవుతుంటాయి. శరవణకుమార్ అనే తయారీదారుడు మాట్లాడుతూ..‘‘ ప్రతి ఏటా నవరాత్రి సమయంలో గోలు బొమ్మల అమ్మకాలు పెరుగుతాయి. 20 ఏళ్ల నుంచి నేను ఈ వ్యాపారంలో ఉన్నాను. ఈసారి ప్రహ్లాదుడి కథను గుర్తుచేసుకునేలా అలాగే ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా భారత సైన్యానికి చెందిన త్రివిధ దళాల కమాండర్ల బొమ్మలను రూపొందించారు’’ అని వెల్లడించారు. వేదవల్లి ప్రాంతానికి చెందిన శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో బొమ్మల కొలువు పెడుతుంటాం. ఈసారి ప్రహ్లాదుడి సెట్‌, భారత సైన్యానికి చెందిన కమాండర్ల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఈసారి మేం వాటినే మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాం’’ అని చెప్పారు.

పిల్లలకు రామాయణ, మహాభారత, భాగవత గాథల్ని పరిచయం చేయడానికి బొమ్మల కొలువు చక్కని వేదికని పెద్దలు చెప్తుంటారు. ఇందులో కొలువుదీర్చిన బొమ్మల ద్వారా వాళ్లు పౌరాణిక, చారిత్రక కథనాలను గుర్తుంచుకుంటారు.