
‘ఇదంతా దైవ సంకల్పం. కాబట్టి ఈ పెను తుపానులనీ, వరదలనీ తిట్టుకోకూడదు. అయినా నదీతీరాలలో అడ్డూఅదుపూ లేకుండా ఇలా కట్టడాలు నిర్మిస్తే ఏమౌ తుంది?’ అన్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. పైగా ఈ మాటలు ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో వినిపించారు.
దీనితో రాజకీయ తుపాను మొదలయింది. వర్షాలంటే ఏమనుకున్నారు? దేవుడి దీవెన అని కూడా భాష్యం చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు అవి వేరే రూపంలో ఉన్నాయంతే అని అన్నారు. డ్యామ్లు కట్టి ఉంటే ఈ వరద బాధ ఉండేది కాదు. అలా అని ఐదేళ్ల నుంచి పదేళ్లు పట్టే డ్యామ్ల నిర్మాణం పాకిస్తాన్ ఇప్పుడు చేపట్టే స్థితిలో లేదు. కాబట్టి గ్రామ స్థాయిలోనే ప్రజలే చిన్న చిన్న డ్యాములు నిర్మించుకోవాలని ఉచిత సలహా పడేశారు.
ప్రస్తుతం వర్షాలు, చీనాబ్, రావి, సట్లేజ్ నదులు పొంగడంతో వెల్లువెత్తిన వరదల కారణంగా లాహోర్, గుజ్రన్వాలా వంటి ప్రాంతాలు అతలాకుతలమైపోతున్నాయి. దీని గురించి భారత్ ముందస్తు హెచ్చరిక చేసి అనేక మంది ప్రాణాలను కాపాడింది కూడా. పాకిస్తాన్ రక్షణ మంత్రి అక్కడితో ఆగలేదు. టీవీ చానల్లో చర్చలో పాల్గొంటూ కూడా ఇదే విషయం ఇంకాస్త పిచ్చి జోడించి చెప్పారు. భగవంతుడు (అనగా అల్లా) ఇచ్చిన ఈ నీటిని కంటేనియర్లలో నిల్వ చేసుకోవాలే తప్ప, ధర్ణాలూ, నిరసనలూ అంటూ రోడ్లెక్కడం ఎందుకు అని కూడా ప్రశ్నించారు. వరదలలో చిక్కుకుని దేశ ప్రజలు తిండీతిప్పలూ లేకుండా అలమటిస్తుంటే ఈ మంత్రేమిటి? ఈ మాటలేమిటి? అంటూ దేశ ప్రజలు సరే, నెటిజన్లు కూడా చీదరించుకుంటున్నారు.





