News

జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన

36views

ఈ-వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

ధ్రువీ పటేల్‌ అనే మహిళ ఈ పోస్టు పెట్టారు. అర్మేనియాలోని సడఖ్లో సరిహద్దు నుంచి జార్జియాలోకి వెళ్తున్న 56 మంది భారతీయులను అక్కడి అధికారులు ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. 5 గంటలకు పైగా గడ్డ కట్టే చలిలో ఉంచారన్నారు. ఆ సమయంలో ఆహారం ఇవ్వకపోగా.. కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా అనుమతించలేదని పేర్కొన్నారు. 2 గంటలపాటు తమ పాస్‌పోర్టులను తీసుకుని జంతువుల్లా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారన్నారు.

నేరస్థుల్లా తమను వీడియోలు కూడా తీసినట్లు తెలిపారు. కానీ, అధికారులు ప్రవర్తించిన తీరుపై వీడియో తీస్తున్న తమను అడ్డుకున్నట్లు వివరించారు. పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే.. వీసాలు తప్పుగా ఉన్నాయని చెప్పారని వెల్లడించారు. భారతీయుల పట్ల జార్జియా అధికారుల తీరు సిగ్గుచేటని, ఆమోదయోగ్యం కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీ, విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌లను ట్యాగ్‌ చేశారు. ఈ ఘటనపై మన ప్రభుత్వం స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ధ్రువీ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సమస్య చాలా కాలంగా ఉందని, జార్జియా గురించి ఇలాంటి పోస్టులు తాను గతంలో కూడా చూశానని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. జార్జియాలో భారతీయుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఉన్నప్పటికీ.. ఇంకా మనపౌరులు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని మరోకరు ప్రశ్నించారు. ఈ పోస్టుపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఇంకా స్పందించలేదు.