News

భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం : ఖలిస్థానీల బెదిరింపులు

54views

కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

ఖలిస్థానీ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్ -SFJ సంస్థ ఈ బెదిరింపులకు దిగింది. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఈ సందర్భంగా భారత హైకమిషనర్‌ దినేశ్ కె.పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది.

‘రెండేళ్ల క్రితం సెప్టెంబరు 18న హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని దర్యాప్తులో వెల్లడైన విషయాన్ని నాటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో పార్లమెంటులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా భారత కాన్సులేట్లు ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా నెట్‌వర్క్‌ను నడుపుతోంది. మాపై గూఢచర్యం కొనసాగిస్తూనే ఉంది’ అని ఆరోపించింది. కెనడా గడ్డపై భారత్‌ చేస్తున్న నిఘా, బెదిరింపుల నేపథ్యంలో కాన్సులేట్‌ను ముట్టడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ బెదిరింపులపై వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ఖలిస్థానీ ఉగ్రవాదులకు తమ దేశం నుంచే నిధులు అందుతున్నాయని ఇటీవల కెనడా ప్రభుత్వం ఒక సంచలన నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లోని పంజాబ్‌లో స్వతంత్ర దేశస్థాపన కోసం హింసాత్మక మార్గాలకు మద్దతు ఇచ్చే ఖలిస్థానీ ఉగ్రమూకలు కెనడా సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది.

అప్పట్లో ట్రూడో ఆరోపణలతో భారత్‌- కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఇరుదేశాలూ పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి. ఇటీవల కెనడాలో జరిగిన ఎన్నికల్లో మార్క్‌ కార్నీ విజయంతో ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు కృషి జరిగింది. ఈ క్రమంలోనే ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను కూడా పునర్నియమించాయి.