
నన్నయ్య, పోతన, శ్రీనాథుడు తదితర ప్రఖ్యాత తెలుగు కవులు, రచయితలు అప్పట్లో తాళపత్రాలపై రాసిన అద్భుత గ్రంథాల మాధుర్యాన్ని భావితరాలకు యథాతథంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తాళపత్ర గ్రంథాల డిజిటల్ ప్రతులను ‘జ్ఞాన భారత్’ పోర్టల్‌లో ఉంచనుంది. టిటిడి ఆధ్వర్యంలో డిజిటలైజ్ చేసిన దాదాపు 5 వేల తాళపత్ర గ్రంథాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు ప్రఖ్యాత రచయితల తెలుగు, సంస్కృత తాళపత్ర గ్రంథాలు చూసే, వాటిని చదివే అవకాశం యువతకు అందుబాటులోకి రానుంది. మన సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలు తెలుసుకోవాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం.
శిష్యులు పరిరక్షించారు..
ప్రఖ్యాత రచయితలు వందల సంవత్సరాల క్రితం రాసిన తాళపత్ర గ్రంథాలను వారి శిష్యులు వేరే తాళపత్రాలపై ఇప్పటివరకు ఐదారుసార్లు యథాతథంగా రాసి కాపాడారు. భారతం, అభినయ భారతం, విష్ణు పురాణం, మేఘ సందేశం, ఆయుర్వేదం, వేదాలు వంటివాటిని ఇలా పరిరక్షించారు. ఆంధ్ర సాహితీ పరిషత్ వేల సంఖ్యలో ఇలాంటి గ్రంథాలను సేకరించి కాకినాడలోని మ్యూజియంలో భద్రపరిచింది. ఆ తర్వాత గ్రంథాలతోపాటు మ్యూజియం భవనాన్ని నిర్వాహకులు రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించారు.
రూ.10 కోట్లతో కాకినాడలో కొత్త మ్యూజియం
కాకినాడలో మ్యూజియం భవనం పాడవడంతో దాన్ని కూల్చేసి అదే స్థానంలో రూ.10 కోట్లతో కొత్త మ్యూజియం నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కేంద్ర సాంస్కృతిక శాఖ రూ.8 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 కోట్లు అందిస్తోంది. సందర్శకులకు వీలుగా కొత్త భవనంలో పలు సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పుడున్న భవనాన్ని కూల్చేసి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.
కాకినాడ మ్యూజియంలో ఉంచిన గ్రంథాలపై పరిశోధనల కోసం వివిధ దేశాల నుంచి స్కాలర్లు ఎప్పటికప్పుడు వస్తుంటారు. వీరు తమకు కావాల్సిన గ్రంథాలను ఎంపిక చేసుకుని కొన్ని రోజులపాటు అక్కడే ఉంటారు.
పోలండ్‌కి చెందిన ఒకరు ఇటీవల జాతకాలకు సంబంధించి ప్రఖ్యాత రచయితలు రాసిన గ్రంథాలపై అధ్యయనం చేశారు.