
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నాడు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించారు.
ఉగ్రవాదాన్ని స్వీకరించి.. దేశ సరిహద్దులను రక్షించుకునేందుకు తాము దిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడామని మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇందుకోసం తాము అన్నింటినీ త్యాగం చేశామంటూ వ్యాఖ్యానించారు. మే 7న భారత దళాలు బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైపోయిందని అంగీకరించారు. ఈసందర్భంగా భారత్ ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాలను ఇలియాస్ వివరంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. బహవల్‌పూర్‌లోని మర్కజ్ సబాన్‌పై కూడా భారత సైన్యం విరుచుకుపడింది. దీన్ని జైషే మహ్మద్‌కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్‌గా పేర్కొంటారు. ఆ భవనాన్ని మసూద్ తన ఇంటిగా వినియోగిస్తున్నాడు. భారత్ ఆర్మీ చేసిన దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు.