News

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం

152views

భాద్రపద శుద్ధ షష్టి వ్యవసాయదారుల ఆరాధ్యదైవం శ్రీ భగవాన్ బలరామదేవుడి పుట్టినరోజు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆగష్టు నెల 29 న రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి.

బలరాముడు తన ఆయుధమైన నాగలి ద్వారా మనకు వ్యవసాయం చేయడం నేర్పాడు. వ్యవసాయానికి అవసరమైన నీటి కొరకు తన నాగలితో యమునానదిని పాయలుగా చీల్చి నీటిని మళ్ళించాడు. ఇది పురాణగాథ కాదని ఇటీవలి ఉపగ్రహ చిత్రాల ద్వారా యమునానది 18 పాయలుగా చీల్చబడిన గుర్తులు కనిపించాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ జరిగినా , నాగలి లేనిదే వ్యవసాయం లేదు.

అలాగే ఆయన మరో ఆయుధం రోకలి. పండిన ధాన్యం ఆహారయోగ్యంగా మార్చడానికి రోకలి ఉపయోగిస్తారు. అంటే నేడు మనం చెప్పుకుంటున్న వాల్యూ ఆడిషన్ అనే దానికి బలరాముడు ఆనాడే మార్గం చూపించాడు. అందువల్ల భారతీయ కిసాన్ సంఘ్ బలరాముడి పుట్టిన రోజును రైతు దినోత్సవంగా జరుపుతోంది.

ఈ వేడుకలో రైతులను భాగస్వాములను చేసి , వారిలో ఐకమత్యం సాధించడం, భూమాతను సంరక్షించే బాధ్యత రైతుల మీద మాత్రమే ఉందని , అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల తన సహజ శక్తిని కోల్పోయిన భూమాతను తిరిగి శక్తివంతం చేయుటకు గోఆధారిత వ్యవసాయం చేయాలని, సేంద్రియ ఎరువులనే వాడాలని తద్వారా విషాహార పంటలను తగ్గించి అమృతాహారాన్ని పండించేలా రైతుల ఆలోచనలో మార్పు తేవడానికి బలరామదేవుడి జయంతిని భారతీయ కిసాన్ సంఘ్ జరుపుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో 18 జిల్లాలలో సుమారు 300 గ్రామాలలో ఈ వేడుకలు జరిగాయని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉమ్మడి సహదేవరెడ్డి తెలియజేశారు.