News

‘భద్రాద్రి’ భూ సమస్య శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

174views

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి భూ సమస్యను రైతులు, దేవస్థానం అధికారులు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆనంద ఆశ్రమ పీఠాధిపతి, సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ సూచించారు. భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవిపై దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధు పరిషత్‌ బృందం పురుషోత్తపట్నంలో పర్యటించింది. రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామయ్య భూముల విషయంలో దేవస్థానం అధికారులు రైతుల పట్ల జులుం ప్రదర్శించడం సరికాదన్నారు. దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటున్న రైతుల సమస్యకు ఓ పరిష్కారం చూపేందుకు శాంతి యుతంగా దేవాదాయశాఖ అధికారులు చర్చలు జరపాలని కోరారు. దేవాలయంలో ఎన్నో సమస్యలుండగా రాములు వారి భూములు సాగుచేసుకుంటున్న రైతులపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని ప్రశ్నించారు. అన్యమతస్తులకు రాములవారి భూములు అమ్మే హక్కు మీకెవరిచ్చారని దేవస్థానం తీరును తప్పుబట్టారు.ఏ ప్రభుత్వం వచ్చినా దేవుడి భూములను రక్షించాలే కాని అమ్మే హక్కులేదన్నారు. తక్షణమే అన్యమతస్తులకు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకుని అప్పడు రైతుల భూములపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని స్వామిజీ పేర్కొన్నారు.