
శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి రచించబడిన అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, ఇతర భక్తులచే రాయబడిన కీర్తనలు భక్తులు ఎంతో శ్రద్ధగా, భక్తితో వింటుంటూరు. శ్రీవారి కీర్తనల కోసం భక్తులు యూట్యూబ్ లేదా ఇతర యాప్‌లను సందర్శిస్తారు. ఈ తరుణంలో కొన్నిసార్లు కీర్తనలు వింటుంటే.. మధ్యమధ్యలో ప్రకటనల వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఆ సమస్యలను చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో అంతరాయాల్లేని భక్తి గీతాలు వినే వెసులుబాటును తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే కీర్తనలు అప్‌లోడ్ చేసింది. శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు కింద ప్రతి నెలా రికార్డైన పాటలను విడుదలైన రోజే అందులో పెడుతోంది. ప్రస్తుతం అందులో 21,725కు పైగా కీర్తనలు ఉన్నాయి. తాళపత్ర గ్రంథాల్లో పొందుపరిచిన అరుదైన గేయాలు వినొచ్చు. ఇప్పటి వరకు పదిన్నర లక్షలకు పైగా కీర్తనలు డౌన్‌లోడ్ అయ్యాయి.
శ్రీవారి కీర్తనలు వినడం ఎలాగంటే!
*టీటీడీ అధికారిక https://www.tirumala.org/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
*వెబ్ సైట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబరు లాగినవ్వాలి.
* తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ‘ఆన్‌లైన్ బుకింగ్స్’ కింద కావాల్సిన ‘అన్నమయ్య పాట’ పట్టాభిషేకం ‘శరణాగతి గద్యము’ శ్రీరామానుజ సహస్రాబ్ది’ ‘శ్రీ అన్నమాచార్య’, ‘ఇతర వాగ్గేయకారులు’ అనే శీర్షికలు ఉంటాయి.
*ఆ శీర్షికల్లో ఒక్కో దాని పై క్లిక్ చేస్తే వందల పాటలు వస్తాయి. వాటిలో కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. అంతరాయం లేకుండా వినొచ్చు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.





