
ఉర్దూను తప్పనిసరి చేస్తూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అగ్గిరాజేసింది. ఈ ఏకపక్ష నిర్ణయమే ఇప్పుడు జమ్మూ కశ్మీర్ యువతలో, ఉద్యోగార్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, మిగతా ఐదు భాషలు కూడా కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారిక భాషలని, వాటి సంగతి ఏంటని యువత అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. కేవలం ఉర్దూను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు తప్పనిసరి చేయడం వెనుక వున్న కుట్రలున్నాయని, దీనిని తప్పకుండా ప్రశ్నిస్తామని, ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సర్వత్రా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేసిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్
నయీబ్ తహసీల్దార్ పరీక్షలకు ఉర్దూ భాషను తప్పనిసరి చేస్తూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కొట్టేసింది. ఇది వివక్షతతో కూడిన నిర్ణయమని అభిప్రాయపడింది. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ అధికారిక భాషల చట్టం, 2020లోని ఐదు అధికారిక భాషల్లో (హిందీ, ఉర్దూ, ఆంగ్లం, కశ్మీరీ, డోగ్రీ) ఏదైనా భాషలో ప్రావీణ్యత వున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (JKSSB) నయీబ్ తహసీల్దార్ పదవికి ఉర్దూను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఉద్యోగార్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పై నిర్ణయాన్ని తీసుకుంది.
వివాదం చెలరేగింది ఇందుకే…
జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు రెవిన్యూ విభాగంలో 75 నయీబ్ తహసీల్దార్ పోస్టుల భర్తీకి ఉర్దూ తప్పనిసరి అని ఉత్తర్వులిచ్చింది. దీంతో వివాదం రేగింది. కేంద్రపాలిత ప్రాంతమైన అక్కడ ఐదు అధికారిక భాషలు వున్నాయని, అలాంటప్పుడు ఉర్దూ తప్పనిసరి అని చేయడం అంటే వివక్షతతో కూడుకున్నదేనని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో ఉద్యోగార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే జోక్యం చేసుకోవాలని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కూడా కోరారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషల బిల్లు, 2020 ద్వారా కాశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, హిందీ మరియు ఇంగ్లీష్‌లను జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషలుగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రెవెన్యూ శాఖ కూడా రెవెన్యూ రికార్డులను ఉర్దూ, ఇంగ్లీష్ మరియు హిందీ అనే మూడు భాషలలో డిజిటలైజ్ చేసింది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై వింకల్ శర్మ అనే ఉద్యోగార్థి స్పందిస్తూ ‘‘నయీబ్ తహసీల్దార్ నియామక పరీక్షల్లో ఉర్దూను తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయం జమ్మూ ప్రాంతవాసులమైన మాకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంది. ఇక్కడి ప్రభుత్వం ఉర్దూను ఎంత నెత్తినెత్తుకుంటుందో అర్థమైపోతోంది. మా దగ్గర అన్ని రకాల వృత్తిపరమైన అర్హతలున్నాయి.కానీ ఉర్దూని తప్పనిసరి చేయడంతో మాకు రావాల్సినవి కూడా మేం కోల్పోతున్నాం. దీన్ని ఒప్పుకోం. భాషా నేపథ్యంతో సంబంధం లేకుండా రాజ్యాంగం పౌరులందరికీ సమాన ఉపాధి అవకాశాల హామీ ఇస్తుంది. భాషాతో పరిమితులను సృష్టించే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగ విరుద్ధమే’’ అని అన్నారు.
రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బీజేపీ..
ఉర్దూ భాషను తప్పని సరి చేస్తూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నయీబ్ తహసీల్దార్ నియామక పరీక్షకు ఉర్దూను తప్పనిచేసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిని జమ్మూ కశ్మీర్ బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ నేతలు సెక్రెటేరియట్, అసెంబ్లీ ముందు నిరసనలకు దిగింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మూడు వారాల పాటు ఈ నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తోంది. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది వివక్షతతో కూడిన నిర్ణయమని, యువత ఆకాంక్షలకు హానికరమని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. జమ్మూ యువత, డోగ్రాలు, ఇతర ప్రాంతాల్లోని ఇతర అధికారిక భాషల పట్ల అన్యాయమే అవుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో తీవ్ర అశాంతి నెలకొంటుందని, ఇతరుల్ని రెచ్చగొట్టడానికి ప్రభుత్వం చూస్తోందని మండిపడుతున్నారు.
‘‘జమ్మూ కశ్మీర్ లో నయీబ్ తహసీల్దార్ పరీక్షలకు ఉర్దూను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. కశ్మీర్ కేంద్రంగా వున్న పార్టీలు ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ దశాబ్దాలుగా జమ్మూ పట్ల వివక్ష చూపుతున్నాయి. దీనికి సజీవ ఉదాహరణే ఈ తాజా ఉత్తర్వు. 2019 తర్వాత వారి విధానం మారుతుందని ఆశించాం, కానీ అదే వివక్ష కొనసాగుతోంది. ఇతర అధికారిక భాషను అణగదొక్కడానికి ఉపయోగపడుతుంది. దీనిని వ్యతిరేకిస్తూ, రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్నాం. యువత కూడా వీధుల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. డిప్యూటీ కమిషనర్ల ద్వారా మెమోరెండం కూడా సమర్పించాం. ఇదే విషయంపై 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కూడా కలిశాం. సానుకూలంగానే స్పందించారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి కచ్చితమైన చర్యల్లేవు. జమ్మూలో అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆందోళన తప్ప వేరే మార్గమే లేదు.’’ అని బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ లాల్ శర్మ అన్నారు. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై CAT నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. తమ పోరాటం ఫలించిందని, తాము చేస్తున్న నిరసనల వల్లే ఈ నిర్ణయం వచ్చిందని బీజేపీ పేర్కొంది.





