
( జూలై 12 – మలయాళ స్వామి వర్థంతి )
మనదేశంలో సామాజిక అసమానతలను రూపుమాపేందుకు మహానుభావులు ఎందరో గత కొన్ని దశాబ్దాల కాలంగా కృషి చేస్తూనే ఉన్నారు. అలా సామాజిక పరివర్తనకై మన పుణ్యభూమిలో అవతరించిన అవధూతే సద్గురు మలయాళ స్వామి. అందరిలోనూ, అన్నింటా దైవాన్ని చూసిన మహనీయుడు ఆయన. వేదాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు నిర్దిష్ట వర్గానికి మాత్రమే అన్న అపోహను తొలగించి అన్ని వర్గాల వారికి సంస్కృతం నేర్పించి అందరికీ దైవజ్ఞానాన్ని అందించిన ఘనత మలయాళ స్వామికి దక్కుతుంది. హైందవ సమాజానికి మరికొన్ని శతాబ్దాలకు సరిపడా ప్రేరణను, ధార్మిక చైతన్యాన్ని ప్రసాదించిన మలయాళ స్వామి 1962 జూలై 12న మహాసమాధి పొందారు. ప్రతి మనిషీ సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించాలని బోధించడమే కాకుండా ఆ దిశగా తన జీవితాన్ని వెచ్చించిన మలయాళ స్వామి వర్థంతి సందర్భంగా శతకోటి వందనాలు..
ఓసారి ఒక భక్తుడు మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారని అడగగా, ‘నేను ఈశ్వర దర్శనం కోసం కాదు, భగవంతుని పట్ల ప్రజలందరికీ అవిచ్ఛిన్నమైన భక్తి కలగాలని ప్రార్థిస్తున్నా…అదే నా జీవిత ఆశయం అని చెప్పిన మలయాళ స్వామి 1885 మార్చి 25న కేరళలోని తిరువాయూర్ సమీపంలో జన్మించారు. ఈయన అసలు పేరు వేలప్ప. తండ్రి పేరు కరియప్ప, తల్లి పేరు నొత్తియమ్మ. చిన్నతనం నుంచే వేలప్ప జాలి, దయ కలిగి ఉండేవాడు. సంస్కృతం నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవాడు. సామాజిక సంస్కరణ వాది శ్రీ నారాయణ గురు ప్రధాన శిష్యులైన శివలింగ స్వామి వద్ద విద్యను అభ్యసించారు. ఆయన వద్ద మంత్రోపదేశం పొంది పతంజలి యోగ రహస్యాలను సాధన చేశారు.
వేలప్ప తన 20వ ఏట పుణ్యక్షేత్ర సందర్శన యాత్రను ప్రారంభించి 9 సంవత్సరాల పాటు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి చివరిగా తిరుమలలోని గోగర్భం చేరి అక్కడ 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆయన వేషభాషలను చూసి భక్తులు మలయాళ స్వామి అని పిలుచుకునేవారు. అనంతర కాలంలో ఆ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. తిరుమలలో కొంత కాలం భక్తులను అనుగ్రహించిన మలయాళ స్వామి ఆ తర్వాత ఏర్పేడు దగ్గర కాశీబుగ్గలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆశ్రమం 1926లో ప్రారంభం అయింది. అదే సంవత్సరం సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం పేరిట సంస్థను ప్రారంభించి ధర్మప్రచార సభలు నిర్వహించారు. 1928లో వేంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు. 1935లో కన్యాగురుకులానికి అంకురార్పణ చేసి అన్ని కులాల వారికీ సంస్కృతం నేర్పారు. 1937 నుండి ఓంకార సత్రయాగం పేరున ఓంకారోపాసనను అన్ని కులాల వారికి, స్త్రీలకు ఇచ్చారు. 1945 నుండి స్త్రీలకు కూడా సన్యాన దీక్షనీయడం ప్రారంభించారు. బ్రహ్మ విద్య ప్రచారంతో పాటు బ్రాహ్మణేతరులకు సన్యాసదీక్షనిచ్చి వారి ద్వారా మఠ మందిరాలను ప్రారంభింపజేశారు.
శ్రీ మళయాళ స్వామివారు యధార్థభారతి అనే పత్రికను నిర్వహించారు. వారు రచించిన శుష్కవేదాంత తమోభాస్కరం అనే గ్రంథం, వారు ప్రవచించిన దయగల హృదయమే దైవమందిరం అనే సూక్తి విస్తృత ప్రచారం పొందాయి. అనుష్ఠాన వేదాంతాన్ని పామరులకి సైతం ప్రచారం చేసిన యోగి ఆయన. తెలుగునాట వేలాది గ్రామాలకి వేదాంత అంతర్గత సమరసతా సుగంధాన్ని వ్యాపింపజేసిన సమతాజ్ఞాన కుసుమం శ్రీ మళయాళ స్వామి. హరిజనులకు సైతం పూజావిధానం, ఆచార వ్యవహారాలు, నియమ నిష్ఠలను అలవర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. జనులందరిలో సమత్వ బుద్ధి సిద్ధించాలని, భగవంతుడిని ఆర్ధ్ర హృదయంతో వేడుకున్న స్వామీజీ ఆకాంక్షను మనందరం నెరవేర్చాలి. అదే మనం ఆ మహానుభావుడికి అందించే నిజమైన నివాళి.





