News

హోటల్‌లో ఆనందనిలయం సెట్టింగ్‌ సరికాదు..

319views

హిందువుల ఆరాధ్యదైవం వెంకటేశ్వరస్వామి అని…మాంసాహారం వడ్డించే, విందులు చేసుకునే హోటళ్లలో స్వామివారి ఆలయ నమూనా సెట్టింగ్‌లు వేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి సమీపంలోని రాయుడు గారి మిలటరీ హోటల్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ హోటల్‌లో ఆనంద నిలయం సెట్‌ ఉండటంపై కొన్ని రోజులుగా భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. వ్యాపార సముదాయాల్లో స్వామి ఫొటో ఫ్రేమ్‌లు భక్తితో పెట్టుకోవడం తప్పు కాదని.. ద్వారపాలకులతో కూడిన ఆలయాన్ని తలపించే సెట్‌లు వేయడం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల్లో ఏ హోటల్‌లోనూ ఇటువంటివి వేయొద్దన్నారు. ఈ రకమైన ధోరణిని కట్టడి చేయకుంటే రేపు విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ నమూనాలు పెట్టే అవకాశముందన్నారు. జగ్గంపేట శాసనసభ్యుడు, తితిదే పాలకమండలి సభ్యుడైన జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో ఈ మిలటరీ హోటల్‌ ఉందన్నారు. నెహ్రూ చేతులమీదుగానే ప్రారంభమైందని అంటున్నారని, ఆయనే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. హోటల్‌ నిర్వాహకులు మాట్లాడుతూ.. కలియుగ వేంకటేశ్వరుడు తమ కుల దైవం అని, ఆయన మీద భక్తితోనే ఏర్పాటు చేశామన్నారు.