News

పాక్‌ను చైనా ఓ మిలిటరీ ల్యాబ్‌లా వాడుకుంటోంది: భారత ఆర్మీ

162views

పాకిస్థాన్‌-చైనా బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. దాయాదికి చెందిన 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ డ్రాగన్‌కు చెందినదేనని వెల్లడించింది. అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి పాక్‌ను చైనా ఒక ల్యాబ్‌లా ఉపయోగించుకుంటోందని పేర్కొంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్‌ సింగ్ మాట్లాడారు.

‘‘సాంకేతికత, నిఘా ఆధారంగా చాలా డేటా సేకరించాం. దాని ద్వారా ఆపరేషన్‌కు ప్లానింగ్ చేశాం. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించాం. వాటిలో తొమ్మిదింటిని టార్గెట్ చేయడం సరైందని భావించాం. చివరి నిమిషంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం. మన సరిహద్దుల్లో ఇద్దరు శత్రువులున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురు ఉన్నారు. అందులో పాకిస్థాన్ మొదటిది. దానికి చైనా నుంచి అన్ని రకాల సహాయం అందుతోంది. పాక్‌కు చెందిన 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ చైనా నుంచి అందినదే. తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాక్‌ను ల్యాబ్‌లా ఉపయోగించుకుంటోంది. తుర్కియే నుంచి కూడా దాయాదికి మద్దతు అందింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత నాలుగురోజుల పాటు భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌) స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు.. భారత్‌ దాడికి అనుసరిస్తున్న పద్ధతులు, ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు బీజింగ్‌ నుంచి ఇస్లామాబాద్‌కు చేరింది’’ అని సింగ్‌ వెల్లడించారు.

కాగా.. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ (SIPRI) గణాంకాల ప్రకారం.. 2015 నుంచి 8.2 బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను పాక్‌కు చైనా విక్రయించింది. 2020 నుంచి 2024 మధ్య చైనా నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. అందులో 63 శాతం ఎగుమతులు పాక్‌కే చేరాయి. ఇవన్నీ దాయాదిని డ్రాగన్‌కు అతిపెద్ద క్లైంట్‌గా మార్చాయి. 2025లో యూఎస్‌ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారతదేశం చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తోంది. అదే సమయంలో పాక్‌ను ఎదుర్కోవాల్సిన ఒక భద్రతా సమస్యగా పరిగణిస్తోందని పేర్కొంది.