News

అయోధ్య రామయ్యకు వజ్ర కిరీటం, స్వర్ణ విల్లంబులు

243views

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్‌ పటేల్‌ అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వజ్రాలు పొదిగిన 11 కిరీటాలు, బంగారు విల్లంబులు విరాళంగా ఇచ్చినట్లు విశ్వ హిందూ పరిషత్-వీహెచ్‌పీ జాతీయ కోశాధికారి దినేశ్‌ నెవాడియా తెలిపారు. వజ్రాలు, 30 కిలోల వెండి, 300 గ్రాముల బంగారం, కెంపులు వీటిలో ఉన్నాయని.. ఇంకా కంఠహారాలు, చెవి రింగులు, నుదుటి తిలకాలు తదితరాలు కూడా అందజేసినట్లు మీడియాకు వెల్లడించారు. ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ఈ వస్తువులు అయోధ్యకు వచ్చాయన్నారు. అయోధ్యలో ‘రామ దర్బారు’ ప్రతిష్ఠాపన మహోత్సవం ముగిసిన నేపథ్యంలో వీహెచ్‌పీ నేత ఈ మేరకు ప్రకటించారు.

ఆలయ నిర్మాణంలో 45 కిలోల బంగారం
అయోధ్య రామాలయ నిర్మాణంలో మొత్తం 45 కిలోల స్వచ్ఛమైన బంగారం వినియోగించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర శుక్రవారం వెల్లడించారు. అన్నీ కలుపుకొని దీని విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందన్నారు. కింది అంతస్తులోని తలుపులు, రాముడి గద్దెకు బంగారాన్ని ఎక్కువగా వినియోగించినట్లు తెలిపారు. శేషావతార ఆలయంలో బంగారు పని ఇంకా కొనసాగుతోందన్నారు. రామాలయ ప్రధాన నిర్మాణం పూర్తయినప్పటికీ..మ్యూజియం, ఆడిటోరియం, అతిథిగృహం, లిఫ్ట్‌ పనులు ఇంకా జరుగుతున్నాయని, డిసెంబరు నాటికి ఇవి పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతానికి రామ దర్బారు సందర్శనకు ఉచితంగా ఇచ్చే పాసులతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. తదుపరి సమావేశంలో అందరినీ అనుమతించడంపై ఓ నిర్ణయం తీసుకొంటామన్నారు.