
మన్ ప్రీత్ సింగ్ ధామి దర్శకత్వంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీయబడిన చలన చిత్రం ” His Story of Itihaas”. ఓ ఫిజిక్స్ టీచరు గా పనిచేస్తున్న ఒక ఎగువ మథ్యతరగతి కుటుంబం కధ ఇది. అతను చాలా నియమ నిబద్ధత తో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆయనకు ఒక స్కూల్ కి వెళ్ళే ఒక కూతురు. అనుకోకుండా ఓ రోజు కూతురి స్కూల్ కి పేరెంట్ టీచర్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు, ఆ స్కూల్ టీచరు ఆయన కూతురు రాసిన ఒక సమాధానం చూపించి మీ ఇంట్లో ఏమిటి సమస్య అని అడుగుతుంది. (ఆయన కూతురు మా ఇంట్లో ఆడవారిని అణగదొక్కుతారు అని రాసి ఉంటుంది) . భార్యా భర్తలకు విషయం అర్ధం కాదు కూతురు అలా ఎందుకు వ్రాసిందీ అనేది తెరపై చూడాల్సిందే.
ఈ చిత్రం అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అసలు భారతీయ చరిత్ర నేర్పకుండా, పిల్లల కు ఎటువంటి ఆధారాలు లేని దొంగ చరిత్ర ఎందుకు నేర్పుతున్నారు అనేది మొదటి ప్రశ్న. చరిత్ర ను చరిత్ర గా చెప్పకుండా నలుపుకు తెల్లరంగు పూసే ప్రయత్నం ఎందుకు జరిగింది అనేది రెండవ ప్రశ్న. భారతీయ చరిత్ర కు సంబందించిన అనేక శాస్త్రీయ ఆధారాలు దొరుకుతున్నా ఏ ఉద్దేశంతో చరిత్ర పుస్తకాలను సవరించలేదు అన్నది మూడో ప్రశ్న. ఈ ప్రశ్న ల కు తోడు యూనివర్సిటీ విభాగాల్లో జరిగే రాజకీయ వ్యవహారాలకి అంతులేదా?, రాజకీయ నాయకులు కూడా తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విద్యావ్వస్ధను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?.ఇంకా అనేక అంతర్లీనమైన ప్రశ్నలు దర్శకుడు ఈ సినిమా ద్వారా మనందరినీ అడుగుతున్నారు.
చరిత్రలో ఇదే జరిగిందీ అని కొన్ని వర్గాల ప్రజలు గట్టిగా నమ్మటం, వారికి శాస్త్రీయంగా ఋజువులు చూపించినా నమ్మక పోవటం, పైగా విద్వేషంతో దూరం అవటం అన్న అంశాన్ని ఎంతో సునిశితంగా ఆయన చూపారు. ముఖ్యంగా చరిత్రలో మంచిని మంచిగా చెడుని చెడుగా ఎటునంటి Bias లేకుండా చూపడం ఎంతముఖ్యమో దర్శకుడు అద్భుతంగా చూపారు. ఈ చలనచిత్రం చూస్తే ఆలోచన కలిగిన భారతీయులు అలా జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి పోయేలా చేస్తుంది.
సాంకేతికంగా, స్క్రీన్ ప్లే పరంగా చక్కటి చలన చిత్రం. నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు అద్భుతమైన న్యాయం చేశారు. ఎంతో మంది ప్రముఖులైన నటులు ఈ పాత్రలు చేయడానికి నిరాకరించారు అని తెలిసింది. వారందరూ చరిత్రలో ఒక అవకాశాన్ని పొగొట్టుకున్నట్టే. సున్నితమైన అతి ముఖ్యమైన అంశాన్ని ఒక చలనచిత్రంగా మలచడంలో దర్శకుడి ప్రతిభ తెలుస్తోంది. నీరజ్ రాత్రీ గారి పుస్తకం ” Brain Washed Republic” దర్శకుడి ని Inspire చేసినట్లు గా చెప్పారు.
ఈ చలన చిత్రం ఎక్కడా విసుగనిపించదు అలరిస్తుంది మెల్లగా ఆలోచించే దిశగా నడిపిస్తుంది. పేర్లు పడుతున్నప్పటికీ ప్రేక్షకులు లేవకుండా ఇంకా కూర్చొని ఉండటం ఈ విషయాన్ని నిరూపిస్తుంది.
చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి





