
కేరళలోని పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో దివ్యాంగుల కేంద్రం కోసం ప్రతిపాదిత స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‌కు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పేరు పెట్టాలనే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను ఎప్పటిలానే కాంగ్రెస్, వామపక్ష సభ్యులు వ్యతిరేకించారు. పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ గందరగోళం మధ్యే తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది.
ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారు
ఈ ఘటనను పాలక్కాడ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, బీజేపీ నేత కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, లెఫ్ట్ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపించారు. దివ్యాంగుల కోసం స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రం ప్రారంభించాలని పాలక్కాడ్ మున్సిపాలిటీ నిర్ణయించిందని, దానిని కూడా కాంగ్రెస్, లెఫ్ట్ సభ్యులు అడ్డుకున్నారని చెప్పారు. చర్చల కోసం కౌన్సిల్ సమావేశానికి అన్ని పార్టీలను చైర్మన్ ఆహ్వానించారని, చర్చలో పాల్గొనడానికి బదులుగా కావాలనే విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించి చైర్మన్‌పై చేయి చేసుకునేందుకు, మున్సిపల్ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.





