News

ఒంటిమిట్ట కోదండరాముడికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

184views

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ భక్త సంజీవరాయస్వామి ఆలయం, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం భక్తులకు ఉదయం 11.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నటేష్‌ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.